నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీ 74వ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులంతా ప్రధానికి అభినందనల వెల్లువనందించారు. రాష్ట్రపతితోపాటు హోంమంత్రి, రక్షణమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు కూడా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ది దిశలో నడిపించడం వెనుక మోదీ తీవ్రమైన కృషిని కొనియాడారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలియజేస్తూ మోదీకి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సైనీ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సహా పలువురు నాయకులు ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి జన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీకి 74 పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని దార్శనికత, నాయకత్వంలో భారత్ అద్భుతమైన పురోగతిని సాధిస్తోందన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ దేశ పరివర్తన దిశగా నడిపిస్తున్నారని అన్నారు. వికసిత్ భారత్ లో ప్రధాని నిబద్ధత గొప్పదని కీర్తించారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ప్రధాని నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నిరంతరం ప్రజాసంక్షేమం కోసం తప్పిస్తున్న ప్రధాని సంకల్పబలం ఎనలేనిదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి భగవంతుడు శ్రీరాముడు దీర్ఘాయువు ప్రసాదించాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రార్థించారు.