అవినీతి, కుంభకోణాలు కూటమికి విడవలేని అలవాట్లు
రాంలీలాలో విపక్షాల ర్యాలీపై మండిపడ్డ సుధాన్షు త్రివేది
న్యూఢిల్లీ: మూడు తరాలుగా చేస్తున్న అవినీతి, కుంభకోణాలు కాస్త ఇండి కూటమి నేతలకు విడవలేని అలవాటుగా మారిపోయాయని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలను కాపాడుకునేందుకు, తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఢిల్లీ రాంలీలా మైదానంలో ర్యాలీకి సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అవినీతిపరులు, దొంగలంతా ఏకమయ్యారని విమర్శించారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్షాలు ఆదివారం ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా సుధాన్షు త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలంతా ఏకమై ర్యాలీలు చేపట్టడం శోచనీయమన్నారు. అవినీతి కూపంలో కూరుకుపోయి సీఎం కేజ్రీవాల్పదవినంటిపెట్టుకొని జైలు నుంచే పాలన చేస్తుండడాన్ని తప్పుబట్టారు.
ఇండికూటమిలోని లాలూ ప్రసాద్, శిబూ సోరెన్, డీఎంకే నాయకులు కనిమొళి, రాజా, కరుణానిధి, కాంగ్రెస్నాయకులు సురేశ్ కల్మాడి, ఎస్పీ నాయకుడు ములాయం సింగ్ లు అవినీతి, అక్రమ సంపాదన, కుంభకోణాల వంటి నేరాలు చేసి జైలు శిక్షను అనుభవించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పార్టీలతో మరో పెద్ద అవినీతి పార్టీ కలిసి ర్యాలీ చేయడం విచారకరమన్నారు. ఇప్పటికే రాహుల్, సోనియా గాంధీలు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన బోఫోర్స్ కేసులో బెయిల్పై బయట ఉన్నారని తెలిపారు.
ఇండికూటమి పార్టీలన్నీ సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భారత రాజకీయాలు విశ్వసనీయతకు సంకేతాలని అన్నారు. రాంలీలా లాంటి ఉన్నత స్థానంలో అవినీతి పార్టీలన్నీ ఏకమవడంపై మండిపడ్డారు. ఒకప్పుడు విపక్షాల గురువు అన్నాహజారే అక్కడి నుంచే నీతి నిజాయితీ శంఖరావాన్ని పూరించారని గుర్తు చేశారు. అలాంటి స్థానం నుంచి నేడు జైలులో ఉన్న, పరారైన వారి తరఫున ఇండికూటమి పార్టీలు ధర్నాలు, ర్యాలీలు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రస్తుతం ఈ పార్టీల గురువులు లాలూ ప్రసాద్ లాంటి అవినీతి పరులేనని ఎద్దేవా చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో విశ్వసనీయతకు మారుపేరుగా బీజేపీ రాజకీయాల్లో రానిస్తోందని త్రివేది స్పష్టం చేశారు. కూటమి పార్టీలన్నీ చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవి దొంగ పనులని సుధాన్షు మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు రాహుల్, సోనియాగాంధీలు బోఫోర్స్ కేసులో బెయిల్పై బయట ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి పార్టీ దేశానికి ఏం ఇవ్వగలదని, చరిత్రను ఏం కాపాడగలదో ప్రజలు మరోసారి ఆలోచించుకోవాలన్నారు. ప్రపంచదేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింప చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కాలిగోటికి కూడా వీరు సరితూగరని సుధాన్షు త్రివేది మండిపడ్డారు.