అమెరికాకు మోదీ
Modi for America
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు శనివారం అమెరికాకు బయలుదేరారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. యూఎన్ లో జరిగే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. మూడు రోజులపాటు ప్రధానమంత్రి పర్యటన కొనసాగనుంది. విల్మింగ్టన్ లో జరిగే ఆరో వార్షిక సమ్మిట్ తో ప్రధాని పర్యటన ప్రారంభమవుతుంది. ఈ సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కలిసి ప్రాంతీయ భద్రత, ఇండో-పసిఫిక్‌లో సహకారంపై చర్చించనున్నారు. అదే రోజు పలు ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. రక్షణ, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై దృష్టి సారించి, ప్రధాని మోదీ అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 22న (ఆదివారం) మోదీ న్యూయార్క్ లో ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టు గెదర్’ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ రాష్ర్టాల నుంచి భారతీయులు, కళాకారులు, మంత్రులు, వివిధ రకాల సంస్థల నిర్వాహకులు తదితరులు పెద్ద యెత్తున పాల్గొననున్నారు. అనంతరం కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి రంగాలకు చెందిన అగ్ర యూఎస్ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు.