సరసమైన ధరలకు ఔషధాలు
జన్ ఔషధి వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి మన్సుఖ్ మాండవియా
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘సంజీవని’ దేశంలోని ప్రతీ ఒక్కరి చెంతకు వైద్యం, ఔషధాలు సరసమైన ధరలకు అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కేంద్రరసాయాలు, ఎరువులు, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలో జన్ఔషధి కేంద్రాల కోసం క్రెడిట్ సహాయ కార్యక్రమాన్ని, వెబ్సైట్ను ప్రారంభించారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ), ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ)ల మధ్య జరిగిన ఎంఓయూ మార్పిడికి మంత్రి మాండవియా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి మన్సుఖ్ మాట్లాడుతూ.. 2014లో కేవలం 80 జన్ ఔషధి కేంద్రాల నుంచి నేడు దేశవ్యాప్తంగా 11వేల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా 10 నుంచి 12 లక్షల మంది సరసమైన ధరలకు ఒక్కరోజులే మందులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. చిన్న పారిశ్రామికవేత్తలు ఈ కేంద్రాలను మరిన్నింటిని తెరిచేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. సిడ్బీ, పీఎంబీఐల మధ్య జరిగిన ఎంవోయూ పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వల్ల దేశ ప్రజలకు చౌకధరల్లోనే మందులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయా సంస్థలు జన్ ఔషధి కేంద్రాల ప్రాముఖ్యతలను, అవసరాన్ని వినియోగదారులకు తెలియజేయాలని కోరారు. రాబోయే రెండేళ్లలో 25వేల కేంద్రాలను తెరుస్తామన్నారు. జన్ ఔషధి కేంద్రాల ద్వారా రెండు వేల రకాల మందులు 300 రకాల శస్ర్తచికిత్సలకు సంబంధించిన పరికరాలు అత్యంత తక్కువ ధరలకే అందుతున్నాయన్నారు.