తొలిదశలో భారీ ఓటింగ్ పై హర్షం
యువత భవిష్యత్ ను నాశనం చేశారు
35యేళ్లలో 3000 రోజులు కర్ఫ్యూనా?
పీఎం శ్రీ కింద 250 పాఠశాలలు అభివృద్ధి
50మంది పిల్లలను బడిలోకి పంపాం
రాళ్లున్న చేతిలో పెన్నులు, పుస్తకాలు, ల్యాప్ ట్యాప్ లు
త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాం
రక్తపాతాలు లేని జమ్మూకశ్మీరే తమ లక్ష్యం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో మూడు కుటుంబ పార్టీలు తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నాయే గానీ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ర్టంలో విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టిస్తూ విధ్వంసాలే తమ అభిమతంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ కు రాష్ర్ట హోదా కల్పిస్తామని మోదీ తెలిపారు.
శ్రీనగర్ లోని షేర్ ఏ కశ్మీర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండో విడత ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు. సెప్టెంబర్ 25న జరగబోయే ఎన్నికల్లో రికార్డులు బద్ధలు కొట్టేలా ఓటింగ్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తొలి దశ రికార్డు ఓటింగ్‌పై మాట్లాడుతూ.. తొలిదశలో భారీ స్థాయిలో ఓటింగ్ జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం అంతం అయిందని, ఎన్నికల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నుంచి బయటకు రావడం మనందరికీ సంతోషం కలిగించే విషయమన్నారు.
ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీలు రాష్ర్ట వినాశనానికి పాల్పడ్డాయన్నారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా ప్రవర్తిస్తున్నాయన్నారు. అధికారాన్ని చేజిక్కించుకొని దోచుకోవడమే లక్ష్యంగా ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల చట్టబద్ధమైన హక్కులను హరించడమే వీరి రాజకీయ ఎజెండాగా ఉందన్నారు. తొలినుంచి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేసింది ఈ పార్టీలే అని ప్రధాని మోదీ మండిపడ్డారు.
బంగారు భవిష్యత్ ఉన్న యువత జీవితాలను నాశనం చేశారని అన్నారు. కానీ తమ ప్రభుత్వంలో యువతకు అన్యాయం జరగనీయబోమన్నారు. వారి భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తామన్నారు.
రాష్ర్టంలో ఉగ్రవాదం, రాళ్లదాడి నుంచి విముక్తి కల్పించామన్నారు. మూడు కుటుంబ పార్టీల హయాంలో విద్యనభ్యసించే విద్యార్థుల చేతుల్లో రాళ్లు పెట్టి వారిని మభ్యపెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ పద్ధతులకు పూర్తిగా నియంత్రించామన్నారు. పాఠశాలలు సైతం తగులబెట్టే చరిత్ర మీదైతే, పాఠశాలల్లో విద్యార్థులు, యువత భవిష్యత్ ను సురక్షితంగా, అభివృద్ధిలో పయనించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పిల్లల చేతిలో రాళ్ల స్థానంలో పెన్నులు, పుస్తకాలు, ల్యాప్ ట్యాప్ లు కనిపిస్తున్నాయని తెలిపారు. నేడు రాష్ర్టంలో పాఠశాలలు, కాలేజీలు, మెడికల్ కళాశాలలు, ఐఐటీలు నిర్మిస్తున్నామని అన్నారు. 50వేల మంది పిల్లలు బడి మానేశారని వారు చేసిన తప్పేమిటని మోదీ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వారందరినీ బడుల్లో చేర్పించిందని తెలిపారు. రాష్ర్టంలో 250 పాఠశాలలు పీఎం శ్రీ పాఠశాలలుగా అప్ గ్రేడ్ అవుతున్నాయని తెలిపారు. 1100 కొత్త మెడికల్ సీట్లు, నర్సింగ్ లో 1500, పారామెడికల్ లో 1600 కొత్త సీట్లు ఏర్పాటు చేయగలిగామన్నారు.
80వ దశకంలో ఎన్నికలను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. యువతకు ప్రజాస్వామ్యంపై పూర్తిగా నమ్మకం కోల్పోయేలా చేశారని మండిపడ్డారు. రాష్ర్ట ప్రజలు మునుపటి పరిస్థితులను ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకోవాలని రాష్ర్ట నవనిర్మాణానికి కృషి చేస్తున్న బీజేపీకి ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఆశ, నిరీక్షణ గొప్ప విజయాలకు తొలి మెట్లని ప్రధాని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే ఇక్కడి రాజవంశాలు భయపడుతున్నాయెందుకని ప్రశ్నించారు. ఎన్నో వివిధ మతాల ఆలయాలు, ప్రార్థనాల స్థలాల ఉన్న రాష్ర్టం భిన్నత్వంలో ఏకత్వంలా ప్రజలు శాంతియుతులుగా ఉండడం ఈ పార్టీలకు నచ్చడం లేదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రలో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నామని తెలిపారు. కశ్మీరీ, సిక్కు కుటుంబాలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఈ వీరిపై అఘాయిత్యాలు, అన్యాయాలలో మూడు కుటుంబాల పాత్ర ఉందన్నారు. కానీ తాము అందరినీ దరిచేర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
35యేళ్లలో కశ్మీర్ లో కర్ఫ్యూ వల్ల 3000 రోజులు బంద్ ఉందన్నారు. 8యేళ్లు ఒక రాష్ర్టం బంద్ లో ఉండే ఇక ఆ ప్రాంత ప్రజల బాధలు వర్ణనాతీతం అన్నారు. పాత రోజులను గుర్తు చేసుకొని రక్తపాతాలు లేని పార్టీ బీజేపీనే ఎన్నుకోవాలని తెలిపారు.
మహిళల ఖాతాల్లో ప్రతీయేటా రూ. 18,000, ఏడు లక్షల వరకు ఉచిత వైద్యం, 24 గంటల ఉచిత విద్యుత్, పీఎంసూర్య ఘర్ ఉచిత విద్యుత్, సబ్సిడీ ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని ప్రజలు ఈ విషయాలన్నింటినీ బేరీజు వేసుకొని బీజేపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.