దగా పడ్డ దళితులకు ఆశాకిరణం మోదీ

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఎప్పటి నుంచో పోరాటం

May 10, 2024 - 13:47
 0
దగా పడ్డ దళితులకు ఆశాకిరణం మోదీ

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఎప్పటి నుంచో పోరాటం జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణ కావాలని మాదిగలు, కొన్ని ఉపకులాలు డిమాండ్​ చేస్తుంటే.. అందుకు ఒప్పుకునేది లేదని మాలలు అభ్యంతరం చెప్తున్నాయి. అసలు ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత ఏమిటి? దాని వల్ల ఎవరికి నష్టం? ఎవరికి మేలు? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీల పట్ల ఏ పార్టీ వైఖరి ఎలా ఉన్నది? అనే అంశాలపై పెద్దపల్లి ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది, మాజీ బ్యూరోక్రాట్​ వెంకటేశ్​ నేతకాని నా తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

నా తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్​:

​1. నా తెలంగాణ: నమస్తే సర్​! తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో పోరాటం జరుగుతున్న ఎస్సీ వర్గీకరణపై చాలా అపోహలు, అనుమానాలు బయట ఉన్నాయి. ఒక మేధావిగా, పెద్దపల్లి పార్లమెంట్​ సభ్యుడిగా ఎస్సీ వర్గీకరణ అవసరం ఏంటో చెప్తారా?

ఎంపీ: నమస్తే మిత్రమా! ఉమ్మడి ఆంద్రప్రదేశ్​ లో గానీ, తెలంగాణలో కానీ ఎస్సీలలో గత కొన్ని దశాబ్దాలుగా సామాజిక అసమానతలకు గురవుతున్న జాతి మాదిగలు. కొన్ని ఉపకులాలు. మాదిగలపై ఇంకా చిన్న చూపు కొనసాగుతుండటానికి కారణం వారు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకపోవడమే. షెడ్యూల్డ్​ కులాల్లో 70 నుంచి 80 శాతం ఉన్న జాతి మాదిగలు. కానీ వారికి దక్కుతున్న ప్రయోజనాలు మాత్రం చాలా తక్కువ. ఈ అంతరాన్ని గుర్తించే క్రమంలో ఉద్భవించినదే ఎమ్మార్పీఎస్​.15 శాతం ఉన్న ఎస్సీల్లో అత్యధిక జనాభా గల మాదిగలు పేదరికంలో ఉన్నారు. సామాజిక అవసమానతలకు గురవుతున్నారు. మాదిగల కంటే తక్కువ జనాభా కలిగిన మాలలు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల పరంగా చాలా ముందు ఉన్నారు. ఈ అంతరాలపై ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ లో అప్పటి ప్రభుత్వం ఒక కమిషన్​ వేసింది. రామచంద్ర రాజు నేతృత్వంలోని కమిషన్​ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీల స్థితిగతులపై అధ్యయనం చేసింది. ఆ కమిషన్​ స్టడీలో తేలిందేమిటంటే.. ఎస్సీల్లో అత్యధిక జనాభా ఉన్న మాదిగల్లో అప్పుడు ఉన్న ఉద్యోగులు 18 వేలు, అదే మాలలు మాత్రం 72 వేలు మంది ఉన్నారు. ఈ ఒక్క విషయాన్ని బట్టి మాలల కంటే మాదిగలు ఎంత వెనుకబడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అసమానతలు తొలగిపోవాలంటే.. వర్గీకరణ అనివార్యమైన రామచంద్ర రాజు కమిషన్​ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వం1996 నవంబర్​ 27న ‘రేషనలైజేషన్​ ఆఫ్​ ఎస్సీ రిజర్వేషన్​ బిల్లు’ను అసెంబ్లీలో ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో జీవో తీసుకొచ్చి అమలు చేసింది. తద్వారా ఏబీసీడీ క్యాటగిరైజేషన్​ అయింది. ఆ జీవో ఇచ్చిన ఐదు సంవత్సరాలలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపు 23 వేల మంది మాదిగ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి. ఇది నచ్చని కొందరు మాలమహానాడు నాయకులు ఇటు హైకోర్టుకు, అటు సుప్రీంకోర్టుకు వెళ్లారు. రాజ్యాంగంలో ఉన్న నిబంధనల పేరుతో నాడు కేంద్రంలో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఉన్న గుడిసెల వెంకటస్వామి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్​ చేశారు. 2004 నవంబర్​5న ఏపీ ప్రభుత్వ చట్టాన్ని నిలిపివేస్తూ.. సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రాజ్యాంగంలో రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్టికల్​341ను మార్చాలంటే పార్లమెంట్​ ఆమోదం కావాలి. పార్లమెంట్​ ఆమోదం లేనందునే నాడు సుప్రీం ఏపీ చట్టాన్ని నిలిపివేసింది. 

2. నా.తె: మాలలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడానికి కారణం ఏంటి?

ఎంపీ: నేను మాల ఉప కులానికి చెందిన వ్యక్తిని. వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగలకు ఇంకొన్ని ఉప కులాలకు ఎలాంటి అన్యాయం జరుగుతున్నదో నాకు తెలుసు. ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా కొంత ముందు మాలలం గుండె మీద చేయి వేసుకొని ఆలోచించాలి. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే.. పెద్దవాడు కొంత బాగా ఎదిగి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కింద ఉన్న వారికి చేయి అందించి తోడ్పాటునందించాలి. ఇక్కడ జనాభా అధికంగా ఉండి అసమానతలు ఎదుర్కొంటూ పేదరికంలో ఉన్న మాదిగలకు మాలలు సహకరించాలి. నేను ఎస్సీ మాల ఉపకులానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ.. ఉన్నత విద్యావంతుడిగా, మాజీ బ్యూరోక్రాట్ గా, పెద్దపల్లి ఎంపీగా వర్గీకరణ నాకు న్యాయమని అనిపించింది. గ్రామాల్లో నేను ప్రత్యక్షంగా మాదిగల పరిస్థితిని చూశాను. అందుకే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నేను పార్లమెంట్​ లో మాట్లాడిన. గౌరవ నరేంద్ర మోదీ కూడా దళితుల్లో అత్యంత వెనుకబడిన మాదిగలు, ఇతర ఉపకులాల సంక్షేమం కోసం వర్గీకరణ పోరాటానికి తానూ ఒక సైనికుడిలా మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.
  
3. నా.తె: మాతోనే సామాజిక న్యాయం సాధ్యమని కాంగ్రెస్​ పార్టీ అంటోంది. దీనిపై మీరు ఏమంటారు?

ఎంపీ: కాంగ్రెస్​ పార్టీ ఆనాడు ఏబీసీడీ క్యాటగిరైజేషన్​ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్​ చేయడం నుంచి మొదలు.. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ సీట్ల కేటాయింపు వరకు మాదిగలకు అన్యాయం చేస్తూనే వస్తున్నది. దళితులను రాష్ట్రపతిని చేయలేదు, ప్రధానమంత్రిని కానివ్వలేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ను ఎన్నికల్లో ఓండించిన పార్టీ కాంగ్రెస్​. ఆయనకు కనీసం భారత రత్న కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఓట్ల కోసం సామాజిక న్యాయం జపం చేస్తే సరిపోతుందా? సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం ఏది? మూడు ఎస్సీ రిజర్వ్​ డ్​ సీట్లు, కంటోన్మెంట్​ ఉప ఎన్నిక మొత్తం నాలుగు స్థానాల్లో మాదిగలకు ఎన్ని సీట్లు ఇచ్చింది కాంగ్రెస్​ పార్టీ? సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్న పార్టీ, ప్రజాస్వామ్యాన్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్​. డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేద్కర్​ ఒక మాట చెప్పారు. రాజ్యాధికారంలో వాటా అయినా.. సంక్షేమంలో భాగస్వామ్యం అయినా.. చిట్ట చివరన, అట్టడుగు వర్గాలకు చేరినప్పుడే సార్థకత. ఈ లెక్క ప్రకారం.. మాదిగలకు కాంగ్రెస్​ రాజ్యాధికారంలో వాటా ఎక్కడ ఇచ్చింది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్​ స్థానాల్లో ఎస్సీలకు, బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చింది? కానీ ఎస్సీ రిజర్వ్​ డ్​ స్థానాల్లో ఎస్సీల్లో మెజార్టీ జనాభా కలిగిన మాదిగలకు బీజేపీ పెద్దపీట వేసి సీట్లు కేటాయించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు బీజేపీ మెజార్టీ స్థానాలు కేటాయించడమే కాదు.. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించింది. ఓటు వేసి గెలిపిస్తే.. ఒక బీసీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఇంత వరకు ఏ పార్టీ ప్రకటించలేదు కదా! ఒక దళితుడి(రామ్​ నాథ్​ కోవింద్​)ని, ఒక గిరిజన బిడ్డ(ద్రౌపది ముర్ము)ను రాష్ట్రపతిని చేసింది మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం. 

4. నా.తె: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, ఆ పార్టీ కులగణన చేయడం లేదని, తాము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని కాంగ్రెస్​ నాయకులు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు?

ఎంపీ: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందనేది దుష్ప్రచారం. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఓటమి భయంతో కాంగ్రెస్​ నాయకులు ఇష్​టమొచ్చిన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 25 జనవరి 2020 నాటికే రిజర్వేషన్ల కాలపరిమితి ముగియాల్సి ఉండగా మోదీ ప్రభుత్వం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను మరో పదేండ్లు పొడిగించే రాజ్యాంగ సవరణను పార్లమెంట్​ ఆమోదించింది వాస్తవం కాదా? తీసేసే ఉద్దేశం ఉంటే ఎందుకు పొడిగిస్తారు? భారతదేశం ఎందరో ప్రధానమంత్రులను చూసింది. ఉన్న రిజర్వేషన్లను కాపాడటమే కాదు.. అర్హులైన వర్గాలకు కొత్త రిజర్వేషన్లు కల్పించింది మోదీ సర్కారు.10 శాతం ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు తెచ్చిన ఘనత బీజేపీదే. బీసీ కమిషన్​ కు రాజ్యాంగ హోదా కల్పించింది. లోక్​ సభ సాక్షిగా1990 సెప్టెంబర్​ 6న మండల్​ కమిషన్​ నివేదికను రాజీవ్​ గాంధీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కులగణన గురించి మాట్లాడే కాంగ్రెస్​ నాయకులు ఎస్సీల్లో జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేసి రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్​ ను ఎందుకు ఒప్పుకోవడం లేదు? యూపీయే హయాంలో మన్మోహన్​ సింగ్​ ప్రభుత్వంలో ఎన్నో కమిటీలు, కమిషన్లు కులగణన చేయాలని చెప్పాయి. మరి కాంగ్రెస్​ అప్పుడెందుకు చేయలేదు? మోదీతోనే రిజర్వేషన్లకు రక్ష. దళిత వర్గాలకు న్యాయం జరగాలంటే అది బీజేపీతోనే సాధ్యం. అందుకే రాష్ట్రంలో దళితులంతా కమలం పార్టీ వైపే ఉన్నారు.

5. నా.తె: మాదిగలకు ఇవ్వాళ కాకుంటే.. రేపు అవకాశాలు వస్తాయి.. అంత మాత్రాన కాంగ్రెస్​ పార్టీని విమర్శిస్తారా? అని ఆ పార్టీ సీనియర్​ నాయకుడు, మాజీ మంత్రి చంద్రశేఖర్​ అంటున్నారు. దీనికి ఏం చెప్తారు?

ఎంపీ: ఇంకెప్పుడు వస్తాయి అవకాశాలు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయితే.. అందులో 65 ఏండ్లు కాంగ్రెస్​ పార్టీయే పరిపాలించింది కదా? మరి దళితులు ఇంకా వెలివాడల్లోనే ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలి. ఎస్సీల జీవితాల్లో వెలుగులు ఏవి? తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహంపై మా అన్న మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నిస్తున్న తీరును నేను స్వాగతిస్తున్నాను. దళితుల విషయంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండు పార్టీలదీ ఒకటే వైఖరి. ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ ఉద్యమం చేస్తుంటే.. కేసీఆర్​ ఆయన ఉద్యమాన్ని అణచివేశారు. ఆయన బయటకు వెళ్లకుండా నిర్బంధం విధించారు. వర్గీకరణ అంశం తెరమీదకు రాకుండా కుట్రలు చేశారు. ఈ విషయంపై నాడు అసెంబ్లీలో కిషన్​ రెడ్డి కేసీఆర్​ ను నిలదీస్తే.. అధికార అహంకారంతో బరాబర్​ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని అణచివేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. దళితుడిని సీఎం చేస్తానని, మూడు ఎకరాల భూమి ఇస్తామని, దళిత బంధు ఇస్తామని ఏం చేశారో ప్రజలకు తెలిసిందే. కాబట్టి దళితులకు మేలు జరగాలంటే పేదల కష్టాలు తెలిసిన, స్వయంగా అనుభవించిన మోదీ లాంటి నాయకుడితోనే సాధ్యం. బీజేపీపై నమ్మకం, మోదీ నాయకత్వంపై విశ్వాసంతోనే నేను బీజేపీలో చేరాను. అధికారం ముఖ్యం కాదు.. మంచి చేయాలన్న ఆశయం ముఖ్యం.