మౌల్వీ సోహెల్ అరెస్టు రాజకీయ నాయకులే టార్గెట్
గుజరాత్ పోలీస్ కమిషనర్ వెల్లడి
గాంధీనగర్: ఇటీవలే పట్టుబడ్డ మౌల్వీ సోహెల్ విచారణలో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. దేశంలోని కీర్తి, ప్రఖ్యాతలున్న రాజకీయ నాయకులను హతమార్చేందుకు ప్రణాళికలు రచించినట్లు గుజరాత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాకు ఈ విషయాలపై సమాచారం అందించారు. అయితే వీరు గురిపెట్టిన కీలక నేతలు ఎవరన్న విషయంపై మాత్రం నోరు విప్పకపోవడం గమనార్హం.
ఎన్నికల నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ సమాచారంతో మౌల్వీ సోహెల్ ను అరెస్టు చేశామన్నారు. ఈ మ్యాడ్యూల్ పై విచారణ కొనసాగుతుందన్నారు. ఇతన్ని అరెస్టు చేసిన సందర్భంగా రెండు వేర్వేరు ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. ఈ ఐడీ కార్డులు సూరత్, మహారాష్ర్టకు చెందినవన్నారు. ఇతనితోపాటు మరో నిందితుడు మహ్మదలీ (షెహనాజ్)ను కూడా అరెస్టు చేశామన్నారు. ఇతను సిమ్ కార్డులు వాడకంలో నేర్పరి అని తెలిపారు. ఇతనిపేరు మీద 17 సిమ్ కార్డులు, 42 నకిలీ ఈ మెయిల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మరొక నిందితుడు రజా తన మొబైల్ ను ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. మొబైల్ ను ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించామన్నారు. దీని ద్వారా మరింత సమాచారం రాబడతామని స్పష్టం చేశారు. వీరు కొన్ని పాక్ లోని సిమ్ లను వాడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
వీరంతా ఒక మాడ్యూల్ గా ఏర్పడి దేశంలోని ప్రముఖులను టార్గెట్ చేశారన్నారు. ఇందులో చాలామంది హస్తముందన్నారు. వారంతా భారత్ లో లేరని సమయానుసారం భారత్ కు అక్రమ మార్గంలో వచ్చి తమ పని పూర్తి చేసుకొని వెళ్లాలనే ఉద్దేశ్యంలో ఉన్నారని పేర్కొన్నారు.