మణిపూర్ హింస హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి భేటీ
వ్యూహాత్మకంగా బలగాల మోహరింపు బాధితులకు మౌలిక సదుపాయాలు, పునరావాసం కల్పించాలని నిర్ణయం త్వరలో మొయిటీ, కుకీ వర్గాలతో హోంమంత్రిత్వ శాఖ భేటీ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మణిపూర్ లో చెలరేగుతున్న హింసను శాశ్వతంగా అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆర్మీచీఫ్ మనోజ్ పాండే, లెఫ్ట్ నెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్, సీఆర్పీఎఫ్ మాజీ చీఫ్, మణిపూర్ ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్, పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. సమావేశానికి ముందు మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికే మంత్రి అమిత్ షాతో భేటీ అయి శాంతిభద్రతలపై చర్చించారు.
ఈ సమావేశం గంటన్నరపాటు జరిగింది. మణిపూర్ లో శాంతిభద్రతలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మణిపూర్ ప్రజల భద్రత కోసం వ్యూహాత్మకంగా కేంద్ర భద్రతా దళాలను మోహరించాలని నిర్ణయించారు. అదే సమయంలో సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులకు మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు తీసుకోనున్నారు. ఆహారం, నీరు, విద్య, వైద్యం తదితరాలను కల్పించనున్నారు. పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. త్వరలోనే మొయిటీ, కుకీ వర్గాలతో హోంమంత్రిత్వ శాఖ భేటీ కావాలని నిర్ణయించారు. ప్రధానంగా హింసకు తావిస్తున్న ఆయుధాల కట్టడికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఒక్క ఆయుధం కూడా ఉండకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. లైసెన్సుడ్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు.