ఆదర్శవంతమైన నవల ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’

An ideal novel 'Mattadi Dunikina Kopula Neelu'

Jul 29, 2024 - 00:15
 0
ఆదర్శవంతమైన నవల ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’

‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన 
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి’

మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడితోని చెప్పిన శ్లోకం   (నీ పని నువ్వు జెయ్యి. ఫలితం ఆశించకు) నిజమైందని చెప్పవచ్చు. రచయిత తమ పనిలో తాము నిమగ్నమై ఉంటారు. నవల గుర్తింపు కోసం తాను ఎక్కడ ప్రచారం చేసుకోలేదు. అటువంటి ఈ నవల తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్ర స్థాయి ఉత్తమ గ్రంథ  పురస్కారం అందుకోవడం ద్వారా తెలంగాణ భాషకు, యాసకు పట్టం కట్టినట్లైంది. పురస్కార గ్రహీతలను ఎంపిక చేసిన విధానంలో తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యవర్గం అనుసరించిన తీరు తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణమని చెప్పవచ్చును.

కుదిరితే పరిగెత్తు
లేకపోతే నడువు 
అదీ చేతకాకపోతే.. పాకుతూ పో
అంతేకానీ ..ఒకేచోట అలా కదలకుండా 
ఉండిపోకు.. 
–-శ్రీ శ్రీ

‘మీ కలలు నిజం కావడానికి ముందు 
మీరు కలలు కనాలి’. 
 If you want to 
Shine like a sun,
First burn like a 
sun. - 
– ఏపీజే అబ్దుల్ కలాం

మరణ మెప్పుడూ శూలంతో కుచ్చిన వేదనే.. మరణాన్ని మరల మరల అనుభవించిన నాకు, చిగురించడం కూడా తెలిసింది. ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ అనే నవల చదువుతున్నప్పుడు రచయిత ఎన్ని బాధలు, కష్టాలు, అవమానాలు భరించారు. ఎన్ని అగచాట్లు పడ్డారనేది మనం అర్ధం చేసుకోవచ్చు. నవల పేరులో స్పష్టంగా వారి జీవితాన్ని మనం తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని  గ్రామీణ ప్రాంతంలో నివసించే వాళ్లకు ఉపేందర్ వాడిన స్వచ్ఛమైన తెలంగాణ పదాలు, భాష ,యాస అర్ధం అవుతది. నేడు తెలంగాణ భాష కొంతమంది మాట్లాడుతున్నా, పూర్తిగా భాష మరుగున పడిపోయింది. తెలంగాణ ప్రజానీకం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరుగక మునుపు తెలంగాణ భాష మాట్లాడాలంటే ఎంతో  అవమానంగా భావించేవారు. కానీ ఈ నవల మాత్రం పుట్టిన ఊరు సుద్దులను, ఆచారాలను, కులవృత్తులను పద్ధతులను  జీవింపచేస్తున్నది. చెరువులోని నల్లరేగడి మట్టిని, ఎండాకాలంలో తవ్వి, ఎడ్ల బండిలో తీసుకెళ్లి, పొలాల్లో, చెలకల్లో వేసి, ఎరువుగా వాడుతారు. అలా చెరువులు  తవ్వగా ఏర్పడే గుంతల్ని, కోపులంటారు. అందులో కొన్ని నీళ్లు నిలబడి, పశువులకి దాహం తీర్చడానికి పనికొస్తుంది. వానలు కురిచినప్పుడు ఆ కొపులల్లో నీళ్లు నిలబడి ఉంటాయి. ఎండాకాలం ఎండ తీవ్రత ఎక్కువ కావడం వల్ల కోపుల్లో ఉండే నీళ్లు అడుగు భాగానికి చేరుతాయి. అలా అడుగు భాగానికి చేరిన నీళ్లు ఒక్కక్కొక చుక్క నీళ్ల కలిసి మళ్లీ పైకి ఉబికి, కోపు నుంచి ఎలా బయటకు దూకాలన్నదే ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు’ వస్తువు.

 నవల రచయిత పరిచయం పేరు  డా.వెన్నం ఉపేందర్. ఆయన తల్లి వెన్నం అనసూర్య, తండ్రి కీ.శే.వెన్నం వెంకటేశం. వీరిది పాత ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాకు సుమారు 35 కి.మీ దూరంలోని  కుక్కడం అనే  గ్రామానికి దగ్గరలో ఉన్న మారుమూల కుగ్రామం గుమ్మడివెళ్లి అనే ఊరు. వీరు పుట్టినప్పుడు వాళ్ల తండ్రి పెద్ద భూసామి. ఇంటి నిండా జీతగాళ్లు, దొడ్డిలో గొడ్లు గోదాలు, ఇళ్లు సూరు అందెంత గుమ్మి నిండా  వరి ఒడ్లు ఉండేనట. 1978 సంవత్సరంలో దేశా వ్యాప్తంగా వచ్చిన కరవు. ఎంతో మంది జీవితాలను దుర్భర పరిస్థితుల్లోనికి నెట్టి వేసిందట. ఆ కాలంలో  వర్షాలు కురవక నీటి ఎద్దడి ఏర్పడి, పంటలు ఎండిపోయి, ఊర్లన్ని కరువు కాటలతో బీటలు వారిన నేలగా వాడిపోయేనట.
పేదరికం తీరుతెన్నులు ఎంతో మంది ముఖచిత్రాలను చిదిమేస్తుంటే.. చదువుకోవాలనే పచ్చని కోరికను ఎడారిలా మార్చేస్తుంటే.. మా ఇండ్లకు మసిపేలికాలు తోరణలుగా దర్శమిస్తుంటే... నూరేళ్ల బతకాలన్న ఆశ సగం ఆయుష్షు దరి చేరకుండా. పాతికేళ్లకే ముఖం మీద ముడతలతో కాటికి కాళ్లు చాపుతుంటే.. ఇక మీరు ఎలా తల్లిదండ్రులను ఉద్ధరించేదంటూ  పేదింటి పిల్లల్ని  వెంటాడే  సమాజం మాట!
 కొంత మంది జీవితాలు గురించి చెప్పితే తరగని ముచ్చట్లు.. అవన్ని కన్నీళ్ల జాడలే.. వాళ్లు అనుభవించి బతికిన క్షణాలు.. ఆ బాధలు.. నెమరేసుకుంటే మింగుడు పట్టక నాలుక మీద బరువైతాయి. కొన్ని సందర్భాల్లో కొందరిని చదివి తెలుసుకుంటే అనిపిస్తతది. అలాంటి అధమ స్థాయి జీవితం నుంచి ఎలా ఉన్నమైన స్థాయికి ఎదిగారని. వెలుగు విలువ తెలవాలంటే జీవితం చీకటారణ్యంలో సాగాలి కదా! అనుభవానికి మించిన గురువేవ్వరు లేరన్న  రచయిత మాట నిజమే కదా! తన బాల్యంలో అనుభవించిన  బాధలు, కష్టాలు వాటి నుంచి నేర్చుకున్న విషయాలను  పాఠాలుగా మనకు చెప్పారు. 
       
‘అక్షరీకరించబడిన జీవితం/కాలే కడుపుకు కాసిన్ని నీళ్లు, సలిపించే గాయనికి కాసింత పశు మూత్ర పూత/నీ వల్ల గాదన్న నిచ్చెన ఎక్కి తీరాలి.. నాలుగు రోడ్లు, నలభై రకాలుగా చీలిపోయినా.. అందులో ఎల్లవేళలా నమ్ముకోదగింది చదువు అని చెప్పుతూ గ్రామీణ యువత ఎదగాలంటే.. ఒదిగి చదువుకోవాలి. ఎన్ని అడ్డుగోడలు ఎదురైనా, చదువుని నిర్లక్ష్యం చేయొద్దని ఇందులో వారి ఇచ్చిన సలహా. అనాథ లా జీవనం చితికిన పసితనం.. బతుకంటేనే పోరాటం.. జీవంతో ఉన్న ఏ జీవికిది అతీతం కాదు.. పోరాటం చివరి అంకంలో ఉన్నప్పుడు మనిషి పడే ఘర్షణ అంత ఇంతా కాదు అంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ భవన్ వారి అనుభవం. సర్కారు బడిల ఐదో తరగతి.. హై స్కూలు చదువులు - ఆమ్లపు చినుకుల స్పర్శలు. ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న ఊరికి, ఎనిమిదో తరగతి కోసం కాలి బాటలో పొలం ఒరాలపై నడుస్తుంటే గుర్తుగా జూసి పక్కకు జారుకునే పాములు, ఎండ్రకిచ్చలు.. పోతుంటే కసిదీర గుచ్చుకున్న తున్నముండ్లు.. పిడికెడన్నం కరువైనోలు శాన మందితో కలిసి  రెండు ముద్దల బువ్వ దొరుకుతదని పోయినంత చదుకోవచ్చన్న ఆశకు ప్రభుత్వ హాస్టల్ ప్రాణం పోసింది. నెలకి సబ్బుల బిల్లుల కింద మంజురయ్యే నాలుగు రూపాయలకు లైఫ్ బాయ్  సబ్బోచ్చేది. దాన్ని ముక్కలు ముక్కలు జేసుకుని, ఆర్నెల్లు వాడుకునేవాడిని. సినిమా చూద్దామా  అయ్యో శని మామా.. అయ్యా రాక రాక లవ కుశ సీనిమోచ్చింది. జర సూడనియ్యండి బాంచన్ అంటూ సినిమా సంగతులు.. మా ఊరు, మా ఇల్లు - ఎప్పటికీ ఒడవని ముచ్చట. మా ఊరంటే గుప్పడు మనస్సులో ఇమడిన గోస నరనరా జల  జలా పారే ఎండమావి బుంగ. ముగింపు లేని ఓ ఎలిజీలా కలుక్కుమంటుంది. అంటూ ఊళ్లో నివసించే  ప్రజలు పడే బాధలు, కష్టాలు, రచయిత  జీవనం శైలిని ప్రస్ఫుటంగా చెప్పుతూ అన్ని కుల వృత్తులను, వ్యవసాయం  రైతు కుటుంబంలో కలిగే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చెపారు. తెగి అతికిన ఇంటరు - కంట అలుగు బోసిన కన్నీరు.. పది సదువు కాగానే: ‘మీ వోడు పది సదివిండు.. పిలగాడు బాగానే సదివిండు. ఉద్యోగం యేడోస్తదని.. యేదన్న పనిలో కుదురమని.. ఓ మోటార్ సైకిల్ రిపేర్ పనిలో నాలుగు పైసలు వస్తాయని.. ఇంటర్ ఎందుకని.. ఐటీఐ చేస్తే షాప్ పెట్టవచ్చని.. బయట వాళ్లు ఇచ్చిన సలహాలు ఒక వైపు.  నువ్వు సదువు కోవాలి బిడ్డ.. సదివి నువ్వు కొవ్వొత్తి గావాల.. నలుగురికీ వెలుగు పంచాల ఈ బాధలు  అన్నీ నేను చూసుకుంటా నువ్వు రంధీ పెట్టుకోకు వారి అమ్మ ఇచ్చిన అభయం. మరో వైపు.. ఇంటర్ చదవాలంటే 40 కిలో మీటర్ల దూరం.. కలలతో ములాకతు చీకటి చిక్కబడే కొద్దీ, కలలు బొమ్మలై ఎదురుంగ కూకొని, ముచ్చట బెడ్తుంటై. కలో గంజో తాగి కడుపు నింపుకునే వారికి కలలు ఒక బలం అని చెప్పుతారు. అమ్మ గాయ పడ్డ కల... కుండ పగిలిన కల.. చెదిరిన పెళ్లి కల.. చచ్చి, మరల బతికిన కల.. మా  నాయన ఖాలిన బడ్డ కల, తెగి పోతున్న తల్లి వేర్ల కల, స్వామీ! ఎన్నో సంవత్సరాలు చూస్తుండగానే, కురిసిన వాన చినుకుల్లా ఇంకిపోయినయి, మా జీవితాలే అప్పుపడ్డయి.  మరణమా -.. రణమా.., ఇంజినీరింగు సదువు - కడుపు నింపిన ఆదరువు. ఇంజినీరు కాలేజీలో సీటు వచ్చింది.. కానీ ఫీజు కట్టేందుకు డబ్బులు లేక వారు పడ్డ కష్టాలు..  కుటుంబ తల్లి వేరు  చింత చెట్టు అన్నట్లుగా  ఇంటి చింత చెట్టే  తనిచ్చే చింతపండు తో నాలుగు సంవత్సరాలు తల్లి, కొడుకును పోషించింది. ఎవరో ఇచ్చిన ఖాకీ రంగు ప్యాంటు, అది ఒదుకులుగా ఉండటంతో పీనీసు పెట్టి  కట్టుకొని మడతలు పడి మాసిన అంగీతో  ఇంజినీర్ చదువు కోసం వారు వెళ్లిన పరిస్థితి.. కొన్ని నమ్మితే , చెడి పొయ్యేది ఏమీ లేదు. సింగరేణి నుంచి సివిల్స్ దాకా, ఇంజినీరింగు చదువు అయిపోయింది. కానీ, వెంటనే ఉద్యోగం రాలేదు. అయినా  ఏ మాత్రం కుంగిపోకుండా కఠోర శ్రమతో, కార్య దీక్షతో సివిల్స్ ఉద్యోగం సాధించారు. కృషి పట్టుదల కలిగిన డా.వెన్నం ఉపేందర్ వ్యక్తిత్వం, పేద మధ్య తరగతి విద్యార్థులకు వారు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. డా.వెన్నం ఉపేందర్ తన జీవితంలో నేర్చుకున్న  నాలుగు పాఠాలు అనుసరించి మనకు అందించారు. ఎంతో మంది చదువులేక, ఆర్థిక పరమైన సాకులు చెప్పుతూ, వారి జీవితాలను ఎటూ కాకుండ చేసుకుంటున్న యువతలో కొంతమందికైన మేలు జరగాలనేది ఈ జీవిత  నవల పరమార్థం.

  1. జీవిత పాఠం : సదువుకు.. ఆకలికి ముడి పెట్టొద్దు.
    2. జీవిత పాఠం : ఇవ్వాళ పోతే రేపు రెండో రోజు.. 
    3. జీవిత పాఠం : చెరువు ఎప్పటికీ ఎండే ఉండదు. 
    4. జీవిత పాఠం : కష్ట మెదురైతే చేసేదేమీ లేదు.. ఇష్టంగా ఎదుర్కోవడమే..
  2. డా.వెన్నం ఉపేందర్ కవి , రచయిత, గొప్ప మానవతావాది. తన జీవితాన్ని  చక్కని  నవలగా రచన చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన వారి కలం నుంచి మరిన్ని రచనలు జాలువారాలని మనసార  కోరుకుంటూ.. ఈ నవలకు మునుముందు జాతీయ ఉత్తమ నవల అవార్డులకు ఎంపిక కావాలని  ఒక పాఠకుడిగా ఆకాంక్షిస్తున్నాను.

కొండేటి ప్రకాశ్
7981 781 086.