ఆర్బీఐ గవర్నర్ గా మల్హోత్రా బాధ్యతల స్వీకరణ
పలు విధానాల రూపకల్పనలో కీలక భూమిక
ముంబాయి: ఆర్బీఐ 26వ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా బుధవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. శక్తికాంతదాస్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం సంజయ్ మల్హోత్రాను ఈ స్థానంలో నియమించింది. మల్హోత్రా 1990 బ్యాచ్ ఐఎఎస్ కు చెందిన అధికారి. ఆర్థిక మంత్రి శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా కూడా విధులు నిర్వహించి ప్రతిభను చాటారు. రాజస్థాన్ లోని ఐఎస్ అధికారులలో నాలుగో సీనియర్ అధికారి. 2020లో డిప్యూటేషన్ పై కేంద్రానికి వచ్చారు. ఈయన ప్రతిభను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ కు పంపలేదు. మల్హోత్రాకు ఫైనాన్స్, టాక్సేషన్, పవర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ వంటి కీలక రంగాలలో 33 ఏళ్ల అనుభవం ఉంది. భారత ద్రవ్యోల్బణం పరుగులు పెడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వృద్ధి రేటులో ముందుకు వెళ్లడం లేదు. దీంతో మల్హోత్రా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వగలరని నిపుణులు భావిస్తున్నారు.
కాన్పూర్ నుంచి ఐఐటీ సైన్స్ లో ఇంజనీరింగ్, యూఎస్ ఎ ప్రిన్స్ టన్ నుంచి మాస్టర్ డిగ్రీని పొందారు. రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలలో వివిధ రంగాలలో పలు సంస్కరణల రూపకల్పనలో మల్హోత్రా కీలకభూమిక పోషించారు. పన్ను విధానాల రూపకల్పన, వసూళ్లు, జీఎస్టీ వంటి విధానాల రూపకల్పనలో ఉన్నతాధికారిగా ఈయన విధులు నిర్వహించారు. ఏది ఏమైనా సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ గా నియామకం పలువురిని ఆకర్షిస్తోంది. ఆర్థికంలో మరింత పట్టుసాధిస్తామన్న విశ్వాసాన్ని రేకెత్తిస్తోంది.