మహిళల రక్షణలో చట్టాలు కీలకం
మూడు నూతన చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ
పాత చట్టాలు దోపిడీకి సాధనంగా ఉండేవి
ఆంగ్లేయుల శక్తి బలోపేతం కోసమే ఏర్పాటు
న్యాయనిపుణులు, రాజ్యాంగవేత్తల కృషి హర్షణీయం
చండీగఢ్: పాత క్రిమినల్ చట్టాలు దోపిడీకి సాధనంగా ఉండేవని, వాటిని బ్రిటీష్ వారు తమ శక్తిని బలోపేతం చేసేందుకే రూపొందించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం ఇండియనల్ పీనల్ కోడ్, సివిల్ డిఫెన్స్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లను అమలు చేస్తున్న తొలి రాష్ర్టంగా పంజాబ్ నిలవనుందన్నారు. మంగళవారం పంజాబ్ చండీగఢ్ లోని పీఈసీ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మహిళలు, బాలికల రక్షణలో ఈ చట్టాలు కీలకం కానున్నాయని తెలిపారు. వీటిని రూపొందించడంలో న్యాయనిపుణులు, రాజ్యాంగవేత్తల కృషి ఉందని హర్షం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతున్న తరుణంలో, రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆ స్ఫూర్తితోనే క్రిమినల్ చట్టాల్లో మార్పు చేర్పులు చేశామన్నారు. దేశంలోని పౌరులకు మన రాజ్యాంగం కల్పించిన ఆదర్శాలను నెరవేర్చడానికి ఇది ఒక నిర్దిష్ట ప్రయత్నమని ప్రధాని వివరించారు. ఆయా చట్టాలపై పోలీసులు, అధికారులు పూర్తి అవగతం చేసుకొని నూతన చట్టాల ప్రకారం ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలోని పౌరులకు మన రాజ్యాంగం కల్పించిన ఆదర్శాలను నెరవేర్చేందుకు ఇది సమష్టి కృషి అని ప్రధాని తెలిపారు. నూతన చట్టాల రూపకల్పనకు సంబంధించిన నోటిఫికేషన్ 2020లో విడుదలైంది. అనంతరం పలువురి సూచనలు, సలహాలను స్వీకరించారు. నూతన చట్టాల రూపకల్పనపై న్యాయమూర్తుల సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఏడు దశాబ్దాల స్వాతంత్ర్య భారత్ లో క్రిమినల్ చట్టాలపై ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి చట్టాలను రూపొందించారు.
నేరవ్యవస్థ పటిష్ఠం: అమిత్ షా..
బానిసత్వానికి సంకేతమైన నేర వ్యవస్థను దూరం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొత్త చట్టాలను పూర్తిగా అమలు చేసేందుకు చండీగఢ్ తొలి నగరంగా మారిందన్నారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మన చండీగఢ్ మొదటి రాష్ట్రంగా మారిందని స్పష్టం చేశారు. పాత చట్టాలు 160 సంవత్సరాల నాటివని మంత్రి అన్నారు. నూతన చట్టాలను ప్రధాని మోదీ దేశ ప్రజల సురక్షితం కోసం అందించారన్నారు. దీని ద్వారా ప్రతీ భారతీయునికి న్యాయం అందించాలన్నదే లక్ష్యమన్నారు. ఈ చట్టాల ప్రకారం వ్యవస్థీకృత నేరాలు జరిగితే 90 రోజుల్లోగా చార్జీషీట్ ను దాఖలు, జీరో ఎఫ్ ఐఆర్ నమోదు, 15 రోజుల్లోగా విచారణ మొదలుపెట్టేలా చర్యలు తీసుకున్నారు.