- – గత పదేండ్ల పాలనలో ఎక్కడా అవినీతి లేదు
- – రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయి
- – ఆ పార్టీలను మళ్లీ దగ్గరకు రానీయొద్దు
- – ఆత్మీయ సమ్మేళనాల్లో కేంద్ర మంత్రి కామెంట్స్
నా తెలంగాణ, హైదరాబాద్:
మోదీతోనే దేశంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. గత పదేండ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా.. పేదల సంక్షేమం కోసం, దేశ ప్రగతి కోసం మోదీ పనిచేశారని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గౌడ సంఘం, కార్మిక సంఘం ఆత్మీయ సమ్మేళనాలకు హాజరై మాట్లాడారు.
తప్పుడు ప్రచారం నమ్మొద్దు..
కేంద్రంలో ఒక మైనార్టీని, దళితుడిని, గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనని కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక కేంద్ర కేబినెట్ లో అత్యధిక మంది బీసీలకు అవకాశం కల్పించిన ఘనత మోదీదే అని తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ప్రధానిగా భారత కీర్తి ప్రతిష్టలు పెంచిన మోదీ ఒక బీసీ నేత అని గుర్తు చేశారు. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం ఏమైందని ఆయన ప్రశ్నించారు.‘కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నది. అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓండించి, ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించింది. ఇప్పుడు ఓట్ల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నది. అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది మోదీ లక్ష్యం. కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేసింది. గత పదేండ్లలో బీఆర్ఎస్ తెలంగాణ సంపదను దోచుకున్నది. అందుకే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపారు. ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్న ఈ రెండు వర్గాలను ప్రజలు ప్రశ్నించాలి”అని కిషన్ రెడ్డి సూచించారు. మరోసారి మోదీని ప్రధానిగా గెలిపించాలని, సికింద్రాబాద్ నుంచి తనను ఎంపీగా ఆశీర్వదించాలని ఆయన కోరారు.