రామాయణ గీతాలు ఆలపించిన ఇటలీ భక్తులు
Italian devotees who sang Ramayana hymns
యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో భేటీ
సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు
లక్నో: ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు విచ్చేసిన ఇటలీకి చెందిన మహిళా భక్తులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆదివారం కలిశారు. ఆయన ముందు రామాయణ్, శివపారాయణానికి చెందిన భక్తి గీతాలను అలవోకగా ఆలపించి ఔరా అనిపించారు. భారతీయ భక్తి, సంస్కృతి, సాంప్రదాయ సాధు వేషధారణలో మహిళలు ఆలపించిన భక్తి గీతాలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రశంసలు పొందుతున్నాయి. వీరు పాడిన గీతాల పట్ల యోగి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విదేశీ గడ్డపై ఉండి కూడా భారత సంస్కృతి, సాంప్రదాయాలు, భక్తి గీతాల ఆలాపనపై హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ మూలాలు విదేశాల్లోనూ పాతుకుపోయాయనేందుకు ఈ మహిళలే నిదర్శనమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా మహిళలు సీఎం యోగితో మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలంటే తమకు ఎంతో ఇష్టమన్నారు. భారత్ లో ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ కుంభమేళాకు వచ్చామని వివరించారు.