అబద్ధాలలో కేజ్రీ నెంబర్ 1!
Kejri is number 1 in lies!
ఢిల్లీ ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్ షా ఫైర్
ఓటమి తప్పదనే నివేదికతో మనస్తాపం
రెచ్చగొట్టే విధానాలతో తప్పు చేశారు
యమునాలో విషం ఎక్కడో చెప్పు
అధికారంలోకి వచ్చాక అవినీతిపై దర్యాప్తు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేజ్రీవాల్ అబద్ధాలు, సాకులు చెప్పడంలో నెంబర్ వన్ అని అమిత్ షా విరుచుకుపడ్డారు. యమునా ప్రక్షాళన, విషం లాంటి వ్యాఖ్యలపై ఈసీకి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. గురువారం ఢిల్లీలోని రోహిణిలో బీజేపీ అభ్యర్థి విజయేందర్ గుప్తాకు మద్ధతుగా జరిగిన సభలో ప్రసంగించారు. కేజ్రీవాల్ తీరును ఎండగట్టారు. ఆ పనిలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. ఆప్ అంటే అబద్ధమని, ఆప్ అంటే మోసమని విమర్శించారు. ప్రశ్నలకు సమాధానాలు లేక తప్పించుకునేందుకు అనేక దొడ్డిదారులు వెతకడంలోనూ కేజ్రీవాల్ నెంబర్ వన్ అన్నారు. ఓటమి ఖాయమని తన నివేదికలో స్పష్టమవడంతో దాన్ని చూసి మనస్తాపానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు.
శీష్ మహల్ అద్దాలు పగులగొట్టే సమయం ఆసన్నం..
ఎన్నికల్లో గెలవాలంటే చెప్పాల్సినవి అబద్ధాలు కావని నిజాలని అన్నారు. ఢిల్లీ ప్రజలను రెచ్చగొట్టే విధానాలకు పాల్పడి పెద్ద తప్పు చేశారన్నారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు వాస్తవం తెలిసి వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా తప్పించుకునేందుకు సాక్షాత్తూ ఎన్నికల సంఘంపై విమర్శలు కురిపిస్తున్నారని మండిపడ్డారు. ‘దొంగే దొంగ దొంగ’ అన్నట్లుగా కేజ్రీవాల్ యవ్వారం ఉందన్నారు. యమునాలో విషం కలిపారని ఎలా కనిపెట్టారు? ఏ ల్యాబ్ లో నమూనాలను విశ్లేషించారో ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. ఢిల్లీలో వేల కోట్ల కుంభకోణాలకు కేజ్రీవాల్ పాల్పడడమే నిజమన్నారు. ప్రజలు శీష్ మహల్ అద్దాలు పగులగొట్టే సమయం ఆసన్నమైందన్నారు. అద్దాలు పగిలిపోయేలా ఈవీఎంల బటన్ లను నొక్కుతూ తీర్పు చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తమన్నారు. అవినీతి, చెత్త, మురికి నుంచి ఢిల్లీకి విముక్తి కల్పిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
బీజేపీ అధికారంలోకి రాగానే పాఠశాలలు, దేవాలయాల వద్ద ఉన్న మద్యం షాపుల మూసివేత, మద్యం కుంభకోణం విచారణ, అవినీతిపై విచారణ, బీజేపీ మేనిఫెస్టోలోని అన్ని హామీల అమలు చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు.