భారతమాతాకు జై తో ఇబ్బందులా?
ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరిస్తారా? కూటమివి బుజ్జగింపు, అవినీతి, బంధుప్రీతి రాజకీయాలు అమ్రోహ్ ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాలపై మండిపడ్డ ప్రధాని మోదీ
లక్నో: యూపీలో బంధుప్రీతి, అవినీతి బుజ్జగింపులతో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎస్పీ, ఇండికూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. భారతమాతాకీ జై అనడంలో కూడా ఇబ్బందులు పడుతున్నపార్టీలను ప్రజలు విడనాడారని అన్నారు. గతంలో అల్లర్ల వల్ల ఇళ్లు వదిలి వెళ్లిపోయారని గుర్తు చేశారు. రామప్రతిష్ట ఆహ్వానాన్ని కూడా కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు తిరస్కరించడం వారి దుష్ట రాజకీయాలకు నిదర్శనమని ప్రధాని మోదీ మండిపడ్డారు. సనాతన ధర్మానికి ఈ పార్టీలు వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూపీలోని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం అమ్రోహ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అఖిలేష్, రాహుల్ గాంధీ, ప్రతిపక్ష కూటమి పార్టీ నేతలపై విమర్శ బాణాలు సంధించారు. దేశ నినాదాలను చేయడానికే భయపడే పార్టీలు దేశాన్ని ఏం ఏలుతాయని, ఉద్ధరిస్తాయని ప్రశ్నించారు. అలాంటి పార్టీల వల్ల దేశానికి కించిత్తూ ఉపయోగం లేదన్నారు.
గతంలో యూపీని పాలించిన పార్టీలు అభివృద్ధిని పక్కన పెట్టి రౌడీ రాజకీయాలను ప్రోత్సహించాయని ఆరోపించారు. వీరి చర్యల వల్ల ఎంతోమంది సొంతిళ్లను అమ్ముకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంతోమంది తమ ఇళ్లు అమ్మకానికి ఉన్నాయని బోర్డు పెట్టుకున్న రోజులను మోదీ గుర్తు చేశారు. ఈ పార్టీలు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడ్డాయని మండిపడ్డారు.
తాను ద్వారకా వెళ్లి శ్రీకృష్ణుని పూజిస్తే కూడా విమర్శలు చేశారని అన్నారు. వీరికి మత విశ్వాసాలు, దేశ సంస్కృతి, సాంప్రదాయాలతో సంబంధం లేదన్నారు. కేవలం కుటుంబ, అవినీతి, అక్రమాలపైనే దృష్టి ఉందన్నారు. ఎలాగైనా మరోమారు దేశాన్ని దోచుకుతినాలనే యావ తప్ప దేశహితం కోసం ఈ పార్టీలు ఆలోచించడం లేదని మోదీ విమర్శించారు.
యోగి నేతృత్వంలోని ప్రభుత్వం యూపీలోని చెరకు రైతులకు సంపూర్ణ మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
యూపీలోని ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు దేశ భవిష్యత్ కు మరింత పునాదులు పటిష్ఠం చేసేలా ఉండాలని అన్నారు. తాము భవిష్యత్ పై పెద్ద లక్ష్యాలతో ముందుకు వెళుతున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.