భారత రాజ్యాంగం సుసంపన్నమైనది

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు

Dec 14, 2024 - 13:16
Dec 14, 2024 - 15:44
 0
భారత రాజ్యాంగం సుసంపన్నమైనది

భారత రాజ్యాంగం సుసంపన్నమైనది
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు
చైనాకు భయపడి రోడ్లు వేయలేదు
కాంగ్రెస్​ మంత్రి వాంగ్మూలం ఇంకా రికార్డులో ఉంది
కాంగ్రెస్​ ఏం చేసింది? బీజేపీ ఏం చేసిందో ప్రజలకు తెలియాలి
భారత్​ లో మైనార్టీలకు ప్రమాదమా?
బంగ్లా, పాక్​ లలో ఉన్న మైనార్టీలపై హస్తం ఏం చెబుతుంది?
దేశాభివృద్ధికే మోదీ ప్రభుత్వం కృషి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అయ్యాక బాబా సాహేబ్​ అంబేద్కర్​ రాజ్యాంగం ఆశయాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించానని, రాజ్యాంగంలో ఎన్నో అంశాలు మిళితమై సుసంపన్నంగా ఉందని గుర్తించానని కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు అన్నారు. లోక్​ సభలో శనివారం రెండో రోజు రాజ్యాంగంపై కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు చర్చను ప్రారంభించారు. యూపీఏ హయాంలో దేశంలో రోడ్లు కూడా సరిగ్గా నిర్మించలేదని ఆరోపించారు. చైనాకు భయపడి సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వారి చేతకాని పాలనకు నిదర్శనమన్నారు. రోడ్లు నిర్మించకపోతే మనదేశంలోకి ప్రవేశించలేదని సాక్షాత్తూ కాంగ్రెస్​ మంత్రి వాంగ్మూలం కూడా ఇంకా రికార్డులో ఉందన్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు.

అప్పటి ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో స్పష్టంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. నెహ్రూ ఏం చేశారు, ఇందిరా, రాజీవ్​ ఏం చేశారు? ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఏం చేసింది. దేశంలో అభివృద్ధి, కేంద్ర పథకాలు, ఫలితాలను అందుకున్న లెక్కలు అన్ని వివరిస్తామని కేంద్రమంత్రి రిజిజు అన్నారు. అప్పుడు ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయన్నారు. భారత్​ లో మైనార్టీలు ప్రమాదంలో ఉన్నారని కాంగ్రెస్​ చెబుతోందని, ఎక్కడ ఉన్నారో? చూపించాలని సవాల్​ విసిరారు. బంగ్లా, పాక్​ లలో మైనార్టీలు (హిందువులు) ప్రమాదంలో ఉన్నది వారికి కనిపించడం లేదా? అని మండిపడ్డారు. కాంగ్రెస్​ శుద్ధ అసత్యాలతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. సభలు సజావుగా నడవనీయకుండా ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకోవడం తగదన్నారు. 

కాంగ్రెస్​ హయాంలోని ప్రభుత్వాలు వాటి పనితీరు ఆధారంగా పనిచేశాయని, కానీ మోదీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నారని అన్నారు. పనితీరు వేరు, లక్ష్యం వేరన్నారు. లక్ష్యం కోసం అహార్నిశలు శ్రమిస్తున్నారు కాబట్టే నేడు ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్​ ఎదిగిందని కేంద్రమంత్రి కిరన్ రిజిజు అన్నారు.