గత పదేండ్లలో తెలంగాణకు  మోదీ ఏమిచ్చారు?

In the last ten years, Modi has given funds of crores of rupees for the development of Telangana

Mar 28, 2024 - 15:50
 0
గత పదేండ్లలో తెలంగాణకు  మోదీ ఏమిచ్చారు?


గత పదేండ్లలో తెలంగాణకు మోదీ ఏమీ ఇవ్వలేదని అటు కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం రేవంత్​ రెడ్డి, ఇటు బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఇటీవల పలు వేదికలపై పదే పదే చెబుతున్నారు. మనసుపెట్టి చూస్తే.. గత పదేండ్లలో తెలంగాణకు మోదీ ఏమిచ్చారనే ప్రశ్నకు కళ్ల ముందు కనిపించే సాక్ష్యాలు అనేకం ఉన్నాయి.
 
రాష్ట్రాల పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది మోదీ ప్రభుత్వం. తద్వారా  2004 నుంచి 14 వరకు తెలంగాణ ప్రాంతానికి కేంద్రం నుంచి రూ.45 వేల కోట్లు అందితే.. 2014 నుంచి గత తొమ్మిదిన్నరేండ్లలో మోదీ సర్కారు తెలంగాణకు రూ.1 లక్షా 60 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో గత పదేండ్లలో రూ.10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. 2014 నుంచి 2023 వరకు 9 ఏండ్లలో మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మించింది. ఇందుకు రూ.1 లక్ష 8 వేల కోట్ల విలువైన నిధులు మంజూరు చేసింది. 2014 నాటికి తెలంగాణలో 2511 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉంటే, మోదీ వచ్చిన 9 ఏండ్లలోనే మరో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించారు. మరో 2269 కిలోమీటర్ల జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానమైనది హైదరాబాద్​ భవిష్యత్​ కు గేమ్​ ఛేంజర్​ గా మారబోతున్న రీజినల్​ రింగ్​ రోడ్డు. రూ.21,201 కోట్లతో 348 కిలోమీటర్ల మేర రీజినల్​ రింగ్​ రోడ్డు నిర్మించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. 

స్మార్ట్​ సిటీస్​.. అమృత్​ పట్టణాలు

పట్టణాలను మరింత ప్రణాళికా బద్ధంగా, మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం స్మార్ట్​ సిటీస్​ మిషన్​ ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణలో వరంగల్​, కరీంనగర్​ పట్టణాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కోసం ఒక్కో సిటీకి రూ.250 కోట్ల చొప్పున మంజూరు చేసింది. హెరిటేజ్​ సిటీ కింద వరంగల్​ కు రూ.32 కోట్లు ఇచ్చింది. అమృత్​ పథకం కింద తెలంగాణ నుంచి ఎంపికైన జీహెచ్​ఎంసీ సహా 12 మున్సిపాలిటీలకు మొదటి ఫేజ్​ లో దాదాపు వెయ్యి కోట్ల నిధులు ఇచ్చింది. ఫేజ్​2 లో భాగంగా 143 మున్సిపాలిటీలకు రూ.2870 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత బీఆర్​ఎస్​ సర్కారు ఎక్కడా బయటకు రానీవ్వలేదు కానీ.. పేదల కోసం మోదీ ప్రభుత్వం తెలంగాణకు 2.50 లక్షల ఇండ్లను మంజూరు చేసింది. రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు నేరుగా 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.12,500 కోట్లు మోదీ సర్కారు అందించింది. గ్రామ స్వరాజ్​ పథకం కింద పంచాయతీలకు రూ.161.5 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.7,071 కోట్లు రిలీజ్​ చేసింది.  స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్య నిర్వహణ కోసం మరో రూ.7.5 వేల కోట్లు ఇచ్చింది. ఎంపీ ల్యాడ్స్​ కింద దాదాపు రూ. వెయ్యి కోట్లు తెలంగాణకు వెచ్చించింది.

రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు

యూపీఏ పాలనతో పోల్చుకుంటే గత పదేండ్లలో తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల్లో మంచి పురోగతి నమోదైంది. 2009 నుంచి14 వరకు యూపీఏ హయాంలో రోజుకు సగటున 17కి.మీ కొత్త రైల్వే లైన్​ నిర్మిస్తే.. 2014–22 కాలంలో రోజుకు సగటను 55 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్​ నిర్మాణం జరిగింది. అంటే వార్షిక సగటు 216 శాతం ఎక్కువ. రైల్వే లైన్ల డబ్లింగ్​ విషయంలోనూ ఇంతే. 335 కిలోమీటర్ల మేర 10 రైల్వే ప్రాజెక్టుల డబ్లింగ్​, 239 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్​ పూర్తయింది. 2014 నుంచి రూ.30,062 కోట్ల అంచనా వ్యయంతో 1645 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టులు తెలంగాణకు మంజూరయ్యాయి. మరో 40 ఏండ్ల అవసరాలకు సరిపడేలా అంటే.. రద్దీ సమయాల్లో 3,25,000 మంది ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ ను మోదీ ప్రభుత్వం ఎయిర్​ పోర్టు తరహాలో రూ.715 కోట్లతో పునర్నిర్మిస్తున్నది. ఇప్పటికే చర్లపల్లి టర్మినల్​ నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచింది. ఎంఎంటీఎస్​ రెండో ఫేజ్​ ను పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేసింది. దీన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆదర్శ్​ రైల్వే స్టేషన్​ పథకం కింద తెలంగాణలో దాదాపు 50 రైల్వే స్టేషన్లను కేంద్రం ఆధునీకరిస్తున్నది. రూ.521 కోట్లతో కాజీపేట్​ లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​ ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాదికి ఇది పూర్తి కానుంది. దీని వల్ల దాదాపు 3000 మందికి ఉపాధి దొరుకుతుంది. సికింద్రాబాద్​ లో రూ.100 కోట్లతో ఇండియన్​ రైల్వే ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్​ మెంట్​ ను కేంద్రం ఏర్పాటు చేసింది. దేశంలోనే మొదటి స్వయం ఇంధన సామర్థ్య(ఏ1 కేటగిరి) రైల్వే స్టేషన్​ గా గుర్తింపు పొందిన కాచిగూడ స్టేషన్​ ను రూ.375 కోట్లతో ఆధునీకరిస్తున్నది. హైదరాబాద్​ మెట్రో రైలు కోసం వయబిలిటీ గ్యాప్​ ఫండింగ్​ కింద రూ.1458 కోట్లు మోదీ సర్కారు తెలంగాణకు ఇచ్చింది. హైదరాబాద్​ అంతర్జాతీయ విమనాశ్రయం విస్తరణకు నిధులు ఇచ్చింది. తెలంగాణలో దీర్ఘకాలంగా పెండింగ్​ లో ఉన్న11 నీటి ప్రాజెక్టులకు రూ.2200 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసింది.

పసుపుబోర్డు

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి చొరవ మేరకు తెలంగాణకు ఎన్నో కొత్త ప్రాజెక్టులు మంజూరు చేసింది మోదీ ప్రభుత్వం. రైతుల చిరకాల స్వప్నమైన పసుపు బోర్డు కలను నెరవేర్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు మోదీ. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తాత్కాలిక క్యాంపస్​ ను ప్రారంభించారు. నదీ జలాల పంపిణీలో దశాబ్దాల పాటు నష్టపోతున్న తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు కృషి చేశారు ప్రధాని మోదీ. తెలంగాణకు ప్రపంచ స్థాయి అత్యాధునిక విజ్ఞాన కేంద్రం(సైన్స్‌ సిటీ) మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ములుగు జిల్లాలోని రుద్రేశ్వర ఆలయం(రామప్ప)కు యునెస్కో గుర్తింపు దక్కేందుకు తోడ్పాటునందించింది. వెయ్యిస్తంభాల గుడి కల్యాణమండపాన్ని పునర్నిర్మించింది. తెలంగాణ రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్‌ నిర్మించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ద్వారా చేనేత కళకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి, జనగామ జిల్లా పెంబర్తి, సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌ గ్రామాలకు ‘వరల్డ్‌ బెస్ట్‌ టూరిజం విలేజ్‌’గా గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేసింది.  ములుగు, తాడ్వాయి, లక్నవరం, మేడారం, బొగత వాటర్‌ ఫాల్స్‌, మల్లూరు, దామరవాయి ప్రాంతాలను కలుపుతూ గిరిజన సర్క్యూట్‌, సోమశిల, మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం, కదళీ వనం, అక్కమహాదేవి, ఈగలపెంట, పరాహాబాద్‌, సింగోటం ప్రాంతాలను ఎకో టూరిజం సర్క్యూట్‌, కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌, పైగా టూంబ్స్‌, హయాత్‌ రక్షి మసీద్‌, రేమండ్స్‌ టూంబ్స్‌ను కలుపుతూ హెరిటేజ్‌ సర్క్యూట్‌ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. హైదరాబాద్‌లో ‘సంగీత నాటక అకాడమీ’ ప్రాంతీయ కేంద్రం, సాలార్జంగ్‌ మ్యూజియంలో లక్ష పురాతన శాసనాలతో ఎపిగ్రఫీ మ్యూజియం, గోల్కండ కోటకు మరమ్మతులు, పరిరక్షణ, ప్రసాద్‌ ఇల్యుమినేషన్‌, సౌండ్‌ అండ్‌ లైట్‌ షోల ఏర్పాటు, కాకతీయ వారసత్వాన్ని సంరక్షించేందుకు వరంగల్‌ కోట ఇల్యుమినేషన్‌, ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రక నిర్మాణాలను గొప్పగా చూపిస్తూ సమగ్ర అభివృద్ధి, నూతన సౌకర్యాల కల్పనకు మోదీ సర్కారు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చింది. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో ఉన్న మింట్‌ కాంపౌండ్‌లో ‘శాశ్వత మింట్‌ మ్యూజియం’ ఏర్పాటుకు కృషి చేసింది. భక్తుల సౌకర్యాల కోసం భద్రాచలానికి, ఆలంపూర్‌ జోగులంబకు, మేడారం జాతరకు మోదీ సర్కారు నిధులు ఇచ్చారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని నిరూపించే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఇవేమీ పట్టని నాయకులు.. ఎన్నికల ముందు ఓట్లు పొందేందుకు ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. వారికి తెలియని విషయం ఏమిటంటే.. అబద్ధాలకు మోసపోయేవారు కారు.. తెలంగాణ ప్రజలు.
– కాక