చారిత్రక నేపథ్య కరీంనగర్ పార్లమెంట్ ఫైట్ ఆసక్తిరేపుతోంది. కమలం జెండాను తొలిసారి ఆ గడ్డపై పాతిన కాషాయ సూర్యుడు బండి సంజయ్ రేసులో ఉండడం కారణం. సంజయ్ ప్రచారం జెడ్ స్పీడ్ వేగంతో దూసుకెళ్తోంది. విజయ సంకల్ప యాత్రతో తన బీజేపీ తన సెగ్మెంట్ ను చుట్టేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగడుతూ.. మరోమారు విజయఢంకా మోగించేందుకు సంజయ్ సకల అస్ర్తశస్త్రాలతో ప్రత్యర్థిని చిత్తు చేయబోతున్నాడు. కేంద్రం నుంచి రూ.2314.92 కోట్ల మంజూరు, రూ.700 కోట్లతో చేనేత క్లస్టర్ల ఏర్పాటుతో కరీంనగర్ కు అభివృద్ధి హారాన్ని తొడుగుతున్న.. బండి పోరాట గడ్డపై విజయ బావుట ఎగురబోతున్నాడు. కాషాద దూకుడుకు అభ్యర్థి వెతుకులా(ఆ)టలోనే కాంగ్రెస్ కళ్లు తేలేస్తోంది.! బీఆర్ఎస్ నుంచి ముచ్చటగా మూడోసారి బోయిన్ పల్లి వినోద్ కుమార్ పోటీలో నిలిచారు.
1952లో పార్లమెంట్ సెగ్మెంట్ గా ఏర్పాటైన కరీంనగర్ ఎంతో మంది గొప్ప నాయకుల ప్రాతినిథ్యానికి, జన్మస్థానానికి నెలవు. తొలి తెలుగు ప్రధాని పీవీ, గవర్నర్ గిరి నిర్వహించిన విద్యాసాగర్ లకు పుట్టినిల్లయితే.. కేసీఆర్, ఎమ్మెస్సార్, చొక్కారావులు రాష్ర్ట, దేశ రాజకీయాల్లో, పాలనలో అత్యుత్తమ పదవులను కల్పించింది. తెలంగాణ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించిన కమ్యూనిస్టు నేత బద్దం ఎల్లారెడ్డి 1952లో జరిగిన తొలిసారి పార్లమెంట్ లో అడుగు పెట్టారు.
నా తెలంగాణ కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ రేసులో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు అస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కరీంనగర్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాలున్నాయి. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్. పార్లమెంట్ నియోజవర్గంలో మొత్తంగా 1146908 ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ వ్యాప్తంగా చేనేతలు, మున్నూరు కాపు, బీసీల్లో ప్రధాన కులాలైన యాదవ, గౌడ, ఇతర కులాలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. గణనీయంగా ఉన్న చేనేతలు, మున్నూరు కాపులు అందరికంటే ఎక్కువ ప్రధానం కాబోతున్నారు. కేంద్రం దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న చేనేత క్లస్టర్లలో భాగంగా కరీంనగర్ లో కూడా రూ.700 కోట్లతో క్లస్టర్ ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నిర్మాణాలు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఫలితంగా చేనేతలకు ప్రత్యక్షంగా ఉపాధి పరంగా, ఆర్థికంగా వారు బలోపేతం అయ్యేందుకు దోహదపడగా.. పరోక్షంగా మరిన్ని రంగాలు కూడా ప్రగతి బాట పడుతున్నాయి. అభివృద్ధికి ఊతమిస్తున్న కేంద్రం నిర్ణయాలతో చేనేతలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం మెండుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేక ఇబ్బంది పడుతుంటే.. తీవ్ర ప్రజా వ్యతిరేకతతో బీఆర్ఎస్ ఎదురురీదుతున్నాయి.
‘విజయ సంకల్పం’తో.. పక్కా..
ఉత్తర తెలంగాణలో కీలక కరీంనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విజయమే లక్ష్యంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఫిబ్రవరి రెండో వారంలోనే తన విజయ సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. తన సెగ్మెంట్ పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూర్, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో ఇప్పటికే కొన్ని దఫాల పాదయాత్ర చేశారు. గ్రామగ్రామాన పర్యటించడంతో పాటు స్థానికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఐదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా గ్రామాలకు విడుదలైన నిధులు, చేపట్టిన పనులు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ .. ముందుకు సాగారు. హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లపై విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. అదే విధంగా రామ మందిరం అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. జగిత్యాలలో నిర్వహించిన విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత వెల్లివిరుస్తోంది. పార్టీ నాయకులు, శ్రేణులతో సమన్వయ సమావేశాలు నిర్వహించడంతో పాటునియోజకవర్గంలోని అన్ని సంఘాల ప్రతినిధులతో ఇప్పటికే సమావేశాలు, భేటీలు నిర్వహిస్తున్నారు.
పాలుపోని బీఆర్ఎస్..
బీఆర్ఎస్ కు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా అననుకూల పవనాలే వీస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో పార్టీ మరింత బలహీనమైనట్టుగా కనిపిస్తోంది. కేవలం సిరిసిల్ల, కరీంనగర్ తప్ప ఎక్కడా కూడా వారికి ఆశాజనకంగా కనిపించడం లేదు. హుజురాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కార్యకర్తలు వరుసగా కమలం గూటికి చేరుకుంటున్నారు. ఈటల రాజేందర్ తన సొంత నియోజవర్గంలో అత్యధిక మెజార్టీ అందించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫలితంగా మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ లు ప్రత్యేక దృష్టి సారించినా.. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపలేకపోతున్నారు. నియోజవర్గాల్లో నిర్వహిస్తున్న సభలు పూర్తి స్థాయిలో విజయవంతం కావడం లేదు. పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, వేములవాడల్లో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోంది. కాషాయ సూర్యుడికి వస్తున్న స్పందనను తట్టుకోలేకపోతున్న వినోద్ కుమార్ , బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం నుంచి తెచ్చిన నిధులు ఏమి లేవని, తనను గెలిపించడం ద్వారా ఈ ప్రాంతం వెనుకబాటుకు గురయిందని ఆరోపిస్తున్నారు.
వెతుకులా(ఆ)టలోనే కాంగ్రెస్ .. పొన్నంకు బాధ్యతలు..
బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంటే కాంగ్రెస్ ఇంకా బలమైన అభ్యర్థిని వెతకడంలోనే నిమగ్నమైంది. ఎన్నికల బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు. ఖమ్మం, కరీంనగర్ సీట్ల కేటాయింపులో రిజర్వేషన్ పరంగా ఎవరికి కేటాయించాలనే విషయంపై ఒకదానికి ఒకటి ఆధారపడి ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఖమ్మంలో రెడ్డి సామాజికవర్గానికి అవకాశం కల్పిస్తే కరీంనగర్‌లో వెలమ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్‌రావుకు, అక్కడ వేరే వారికి అవకాశమిస్తే కరీంనగర్‌లో ప్రవీణ్‌రెడ్డికి టికెట్ దక్కవచ్చని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్ నుంచి టికెట్ ఆశించిన హస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని కాదని ఆ స్థానంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అవకాశం కల్పించారు. ఈ సందర్భంలో రేవంత్‌రెడ్డితోపాటు కేంద్ర నాయకత్వం ఆయనకు ఎమ్మెల్సీ పదవి లేదా లోక్‌సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనికి తోడు ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులు ఉండడంతో రాష్ట్ర ఎన్నికల కమిటీ ఈ స్థానానికి ప్రవీణ్‌రెడ్డి పేరును మాత్రమే కేంద్ర కమిటీకి పంపించింది. అయితే కేంద్ర కమిటీ మాత్రం ముగ్గురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ప్రవీణ్‌రెడ్డి లేదా రాజేందర్‌రావుకు అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇప్పటికే ఆరు స్థానాలను కేటాయించారు. పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీలో రెడ్డి అభ్యర్థులే ఉండడంతో వీరిలో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.
ప్రగతి చుక్కాని కరీంనగర్.. రూ. 2314.91 కోట్ల కేంద్ర నిధులు..
సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి వివిధ పథకాల కింద కేంద్రం నుంచి ఏకంగా రూ.2314.91 కోట్లను తీసుకొచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గానికి రూ.145.05 కోట్ల ఖర్చుతో 8,041 ఇండ్లను మంజూరు చేశారు. ఇప్పటికే రూ.111.72 కోట్ల నిధులు విడుదల కాగా.. ప్రస్తుతానికి 6,749 ఇండ్ల నిర్మాణం పూర్తైంది. స్వచ్ఛ్ భారత్ మిషన్ లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యానికి ప్రాముఖ్యత ఇచ్చి కోట్ల నిధులు కేటాంచారు. అమృత్ పథకంలో భాగంగా అటల్ మిషన్ పట్టణ పునరుద్ధరణ కింద రూ.281.02 కోట్లతో నియోజకవర్గంలోని పట్టణ కేంద్రాలను అభివృద్ధి చేశారు. అమృత్ 2.0 లో రూ.583.37 కోట్లలను కేటాయించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకంలో నియోజకవర్గంలోని 55,129 మందికి రూ.76.48 కోట్ల రుణం మంజూరు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అమలులో భాగంగా పట్టణ జీవనోపాధి మిషన్ కింద 1,652 స్వయం సహాయక సంఘాల ద్వారా నియోజకవర్గంలోని 6,624 మందికి బ్యాంక్ రుణాలు. మరో 3,542 మందికి ఉపాధి శిక్షణ అందించింది. స్మార్ట్ సిటీలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మౌలిక సదుపాయాల కల్పించేందుకు రూ.1117.27 కోట్ల ఖర్చుతో 50 అభివృద్ధి పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిలో ఇప్పటికే రూ.839.21 కోట్లు ఖర్చు చేసి 25 పనులు పూర్తి చేసింది.
ఆది నుంచీ వెలమలదే ఆధిపత్యం..
కరీంనగర్ లోక్‌సభ స్థానం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ వెలమల ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది.1952లో ద్విసభ్య నియోజకవర్గంగా కరీంనగర్ లోక్‌సభ స్థానం ఏర్పడింది. ఇక్కడ 16 సార్లు సాధారణ ఎన్నికలు, మూడు ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు15 పర్యాయాలు వెలమ అభ్యర్థులు, మూడు సార్లు బీసీ నాయకులు, ఒకసారి రెడ్డి సామాజిక వర్గం, రెండు సార్లు ఎస్సీ అభ్యర్థులు విజయభేరి మోగించారు. 10 సార్లు కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయగా.. నాలుగుసార్లు బీఆర్ఎస్, మూడుసార్లు బీజేపీ విజయనాదం చేశాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెందిన వినోద్‌కుమార్ గెలుపొందగా.. 2019లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ విజయం సాధించారు