స్పేస్ డాకింగ్ కు ఇస్రో సిద్ధం
ISRO is ready for space docking
డిసెంబర్ 30న పీఎస్ ఎల్ వీ సీ–60 ద్వారా ప్రయోగం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్ స్పాడెక్స్ కు సిద్ధమైంది. ఈ మిషన్ ను డిసెంబర్ 30 (సోమవారం) చేపట్టనున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది. శనివారం సామాజిక మాధ్యమంలో ఇస్రో ఈ మిషన్ పై జరుగుతున్న పనులతో కూడి చిత్రాలను పోస్ట్ చేసింది. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించనున్నామన్నారు. స్పాడెక్స్ మిషన్ పై అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. అంతరిక్ష రంగంలో భారత్ కు ఈ మిషన్ కీలకమైందన్నారు. పీఎస్ ఎల్ వీ ద్వారా దీన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతికతను ‘భారతీయ డాకింగ్ సిస్టమ్’తో రెండు ఉపగ్రహాలను ప్రయోగిస్తామని తెలిపారు.
ఈ మిషన్ లో ఎస్ డీఎక్స్–01, ఎస్ డీఎక్స్–02 అనే రెండు సారూప్య ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఒక్కో ఉపగ్రహం 220 కేజీల బరువు ఉంటుంది. ఈ ఉపగ్రహాలను భూమి నుంచి 470 కి.మీ. ఎత్తులో పీఎస్ ఎల్ వీ సీ–60 రాకెట్ ద్వారా శ్రీహరి కోట స్పేస్ సెంటర్ నుంచి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మిషన్ ద్వారా భవిష్యత్ లో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవసరమైన క్లిష్టమైన ఇన్ స్పేస్ డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేయడం, ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే అంతరిక్షంలో ముందున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానాన్ని నిలుపుకోనుంది.