హౌతీ స్థావరాలపై ఐడీఎఫ్ దాడులు
ముగ్గురు మృతి, వందమందికి తీవ్ర గాయాలు ఏ ఒక్కరినీ వదలబోమన్న రక్షణ మంత్రి
సనా/జెరూసలెం: గాజా తరువాత ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) యెమెన్ లోని హౌతీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారీ దాడులను కొనసాగిస్తోంది. యెమెన్ లోని వీరి స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా వందమందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. పలు ఇంధన డిపోలపై బాంబులు పడడంతో పెద్ద యెత్తున మంటలు చెలరేగాయి. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.
ఇటీవల విదేశాల నుంచి ఇజ్రాయెల్ కు వస్తున్న వస్తు, ఆయుధ నౌకలపై హౌతీ సముద్రపు దొంగలు దాడులకు తెగబడుతున్నారు. ఉగ్రవాదులు ఇజ్రాయెల్ కు ఎవ్వరూ సహాయం చేసినా వారి నౌకలపై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. అదీగాక ఇటీవలే ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ పై ఏకకాలంలో రాకెట్ దాడులకు పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించినట్లుగా ఐడీఎఫ్ ప్రకటించింది. దాడులకు స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బెంజమిన్ వహించడం గమనార్హం.
హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించిన హోడెయిడా పోర్ట్ పై దాడులతో పోర్ట్ లో చాలా భాగం ధ్వంసమైంది.
దాడుల అనంతరం ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ప్రకటన వెలుగులోకొచ్చింది. ఈ ప్రకటనలో మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెలీల రక్తానికి బదులు తీర్చుకుంటామన్నారు. తమపై దాడులు చేసిన ఏ ఒక్కరిని వదలబోమని హెచ్చరించారు.