18రాష్ట్రాలకు భారీ వర్ష అలర్ట్
తెలుగు రాష్ట్రాల వర్ష బీభత్సం ఆంధ్రప్రదేశ్ లో 8మంది మృతి రైల్వే ట్రాక్ లు నీటమునిగి ఆరు రైళ్లు రద్దు సెప్టెంబర్ 2 భారీ వర్షాలు ఐఎండీ హెచ్చరికలు జారీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 18రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరికను ఐఎండీ జారీ చేసింది. శనివారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో 8 మంది మృతిచెందగా, తెలంగాణలోని పలు రైల్వే ట్రాక్ లు పూర్తిగానీటిలో మునిగిపోయాయి.
తెలంగాణలోని కేసముద్రం-మహబూబాద్ మధ్య రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ వంకర్లు పోయింది. దీంతో ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు చనిపోగా, గుంటూరులో కాలువలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఢిల్లీ–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరు రైళ్లను రద్దు చేయగా, 9 రైళ్లను దారి మళ్లించారు.
సెప్టెంబర్ 2న మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోనూ భారీ వర్షాల అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది.
మరోవైపు వారణాసిలో కురుస్తున్న వర్షాలతో 55 ఘాట్ లు గంగానదిలో మునిగిపోయాయి. గంగానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
ఆగస్టులో దేశవ్యాప్తంగా 253.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని 2001 తరువాత ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండీ తెలిపింది. సెప్టెంబర్ లోనూ గతం కంటే 9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అలర్ట్ జారీ..
కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, సిక్కిం, మణిపూర్, అస్సాం, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 2న జమ్మూ కాశ్మీర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్‌లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌తో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని వాతావరణ శాఖ సెప్టెంబర్ 2న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.