ఏడు రాష్ట్రాలకు హీట్ వేవ్ రెడ్ అలర్ట్ రాజస్థాన్ లో ఎండలకు 8మంది మృతి
ఐదురోజులపాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక దేశంలోని 150 రిజర్వాయర్లలో అడుగంటిన జలాలు తొలిసారిగా దేశంలో 237 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ పార్కులు, స్విమ్మింగ్ పూల్ లను ఆశ్రయిస్తున్న ప్రజలు జూపార్కులకు తప్పని తిప్పలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు హీట్‌వేవ్ రెడ్ అలర్ట్ ను ఐఎండీ జారీ చేసింది. హీట్ వేవ్ ప్రభావంతో రాజస్థాన్ లో గురువారం ఒక్కరోజే 8 మరణాలు సంభవించినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, హరియాణా, పంజాబ్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 40 నుంచి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లవద్దని హెచ్చరించింది. బార్మర్ లో గత రెండు రోజులుగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. భారత్ – పాక్ సరిహద్దులో ఏకంగా 53 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఎండలు విజృంభిస్తుండడంతో వైద్యశాఖ వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది సెలవులను రద్దు చేసింది.
మరోవైపు యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) దేశంలోని 150 రిజర్వాయర్లలో నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొంది. ఢిల్లీలో యమునా నది నీటిమట్టం తగ్గిందని తెలిపింది. దీంతో పలు ప్రాంతాల్లోని నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నట్లు పేర్కొంది.
హీట్ వేవ్ కారణంగా దేశంలో విద్యుత్ డిమాండ్ 237 గిగావాట్లుగా ఉన్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ డేటా విడుదల చేసింది. ఈ ఎండకాలంలో ఇదే అత్యధిక డిమాండ్ అని పేర్కొంది. 2023లో కూడా 243.27 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిందని వివరించారు. ఎండలకు తాళలేక ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు,ఏసీలను ఆశ్రయిస్తుండడంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందని తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ కంటే ఈ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసిన హీట్ వేవ్ రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉందని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.
హీట్ వేవ్ భారీ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు చల్లటి పానీయాలను తీసుకుంటున్నారు. మరోవైపు స్విమ్మింగ్ పూల్ లు, పార్కులలో మధ్యాహ్నం వేళ జనాలు సేదదీరుతున్నారు. ఇక ఆయా రాష్ట్రాల్లోని జూపార్కుల్లో ఉన్న జంతువులకు హీట్ వేవ్ తో తట్టుకోలేక పోతుండడంతో అధికారులు చర్యలు చేపట్టారు. చల్లటి నీటిని వాటిపై రెండుసార్లు చల్లుతున్నారు. చిన్న జంతువు కోసం గడ్డితో వేసిన శామియానాలు లాంటివి ఏర్పాటు చేశారు. శాఖాహార జంతువులైతే హీట్ వేవ్ తట్టుకోలేక నెమళ్ల పించాల్లో దాగడం కొసమెరుపు.