హల్ద్వానీ నిందితుడు మాలిక్ అరెస్ట్
కూపీ లాగే పనిలో పోలీసులు.. వివరాలు వెల్లడించిన ఐజీ నీలేశ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హల్ద్వానీలో అక్రమ కట్టడం కూల్చిన ఘటనపై చెలరేగిన అల్లర్లలో ప్రధాన సూత్రధారి అబ్దుల్ మాలిక్ ను పోలీసులు శనివారం ఢిల్లీలో అరెస్టు చేశామని ఐజీ నీలేశ్ భర్నే తెలిపారు . ఇతనిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఫిబ్రవరి 8న జరిగిన హింసాకాండలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి పరారీలో ఉన్న మాలిక్ లాయర్ల ద్వారా కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవడం గమనార్హం. హింసతో మాలిక్ కు ఎలాంటి సంబంధం లేదని మాలిక్ తరఫు న్యాయవాదులు హల్ద్వానీ కోర్టుకు విన్నవించారు. అతను హింస చెలరేగే నాలుగు రోజుల ముందు నుంచే ఆ ప్రాంతంలో లేడని తెలిపారు.
ఇప్పటికే రాళ్లు రువ్విన ఘటనలో ఆరుగురుని పోలీసులు అరెస్టు చేశారు. హింసలో పాల్గొన్న నిందితుడు అజాజ్ ఖురేషీ ఆస్తులు జప్తు కూడా చేశారు. అబ్దుల్ మాలిక్ ఆస్తులు కూడా జప్తు చేశారు.
అబ్దుల్ మాలిక్ పై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో రూ. 2.44 కోట్లు స్థిర ఆస్తులను సీజ్ చేశారు. అక్రమ కట్టడాలను కూల్చి వేశారు.
అబ్దుల్ మాలిక్ పై ఉత్తరాఖండ్ రాష్ర్ట బీజేపీతో బాటు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఇతని హింసాకాండ, దుశ్చర్యలపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండడంతో దేశం నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.
ఏది ఏమైనా ఇన్నిరోజుల తరువాత మాలిక్ అరెస్టుతో పోలీసులు పూర్తి కూపీ లాగే పనిలో పడ్డారు.