బీజేపీలో చేరిన గాలి
జనార్ధన్ రెడ్డి కమలంలో కెఆర్పీపీ విలీనం
బెంగళూరు: కర్నాటక మాజీమంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. సొంతగూటికి చేరడంతో పాటు గాలి జనార్దన్‌రెడ్డి తన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. కర్ణాటక రాష్ర్ట అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సమక్షంలో సోమవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. గాలితోపాటు ఆయన భార్య కూడా బీజేపీలో చేరారు. గాలి జనార్దన్‌రెడ్డి స్థాపించిన ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గాలి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. తాను బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తను మాత్రమే అని పేర్కొన్నారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని తెలిపారు. అనంతరం మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. గాలి పార్టీలో చేరడం మంచి నిర్ణయమని తెలిపారు. ఈయన చేరికతో కర్ణాటకలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రాష్ర్టంలో 28 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.