అసోంలో వరదలు 26మంది మృతి
, 1.61 లక్షలమంది నిరాశ్రయులు రుతుపవనాల రాక ఐఎండీ అలర్ట్ జారీ అరుణాచల్ లో వెయ్యిమంది పర్యాటకులు సురక్షిత ప్రాంతాలకు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు చేరాయి. అసోంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపోర్లు తున్నాయి. వరదల కారణంగా బుధవారం వరకు 26 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. 1.61 లక్షల మంది వరదలతో ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. నిరాశ్రయుల కోసం షెల్టర్లు ఏర్పాటు చేసి సహాయక చర్యల్లో వేగం పెంచామని తెలిపారు. మరోవైపు అసోంలో వర్షాలు, వరదలు, ప్రాణ, ఆస్తినష్టాలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలన్నారు. ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే కేంద్రం సహాయం తీసుకుందామని తెలిపారు.
కాగా మరో మూడు నాలుగు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్‌లలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే త్వరలోనే ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని వెల్లడించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఐఎండీ తెలిపింది.
రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు అరుణాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి 2000మంది పర్యాటకులు చిక్కుకోగా రెస్క్యూ బృందాలు బుధవారం ఉదయం వరకు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వెయ్యిమందిని తరలించేందుకు రెస్క్యూ చర్యలు కొనసాగిస్తున్నారు. అసోం కజిరంగా నేషనల్ పార్క్ లో వరదల వల్ల భారీగా నీరు చేరడంతో జంతువులను సురక్షిత ప్రాంతాల్లో తరలించేందుకు అటవీశాఖ స్పెషల్ ఆఫీసర్లు రంగంలోకి దింపింది.