గుజరాత్–నాసిక్ రహదారిపై రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి
17 మందికి తీవ్ర గాయాలు

గాంధీనగర్: గుజరాత్ –నాసిక్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం ఉదయం గుజరాత్ లోని డాంగ్ జిల్లాలో ఆదివారం ఉదయం 4.15 గంటలకు యాత్రికులతో సపుతర హిల్ స్టేషన్ సమీపంలో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్లింది. వేగంపై డ్రైవర్ పూర్తిగా నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని ఎస్పీ ఎస్.జీ. పాటిల్ తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 48 మంది యాత్రికులు ప్రయాణిస్తున్న వివరించారు. విషయం తెలుసుకొని సహాయక చర్యలు చేపట్టామన్నారు. బస్సు అద్దాలు ధ్వంసం చేసి లోపలున్న వారిని బయటికి తీసుకువచ్చామని తెలిపారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నామని తెలిపారు. 35 అడుగుల లోయలో పడడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని, పలువురి పరిస్థితి విషమం ఉందని తెలిపారు. ఈ బస్సు మహారాష్టలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్ లోని ద్వారకకు బయలుదేరిందని, యాత్రికులంతా మధ్యప్రదేశ్ లోని గుణ, శివపురి, అశోక్ నగర్ జిల్లాలకు చెందినవారిగా గుర్తించామని పాటిల్ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.