ఇండి కూటమి నుంచి మరో పార్టీ అవుట్
ఎవరితో పొత్తు ఉండదని ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటన
శ్రీనగర్: సార్వత్రిక ఎన్నికల ముందు ఇండి కూటమికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కూటమిలోని పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా సొంత నిర్ణయాలతో చీలిపోతున్నాయి. ఇప్పటికే బిహార్‌లో ఇండి కూటమి నుంచి జేడీయూ అధినేత నితీష్‌కుమార్ బయటకు వెళ్లిపోయి ఎన్డీఏతో జత కట్టారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించేశాయి. ఇప్పుడు ఈ కోవలోకి మరో పార్టీ వచ్చింది.
పొత్తులు ఉండవు..
ఇండి కూటమిలో కీలక మద్దతుదారుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా.. మంచి విజయాన్ని సాధిస్తామని ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. సీట్ల షేరింగ్‌పై ఏకాభిప్రాయం కుదరకపోవడంపై గత నెలలో ఫరూఖ్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. మనం దేశాన్ని రక్షించాలంటే.. విభేదాలను పక్కన పెట్టి దేశం గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. కానీ ఇంతలోనే ఇలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
రెండు ఎన్నికలు ఒకేసారి ఉండొచ్చు: ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ లో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని భావిస్తున్నట్లు ఫరూఖ్ అబద్దుల్లా తెలిపారు. సీట్ల పంపకాలపై ఆయన మాట్లాడుతూ..ఒంటరిగానే బరిలోకి దిగుతామని వెల్లడించారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు పిలిస్తే వెళ్తారా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఎందుకు వెళ్లకూడదో చెప్పాలన్నారు. మాట్లాడటంతో జమ్మూకశ్మీర్ లోని సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయంటే ఎవ్వరితోనైనా తాము సంప్రదింపులకు సిద్ధమేనని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
చర్చలు జరుపుతున్నం: జైరాం రమేశ్
ఎన్‌సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. అబ్దుల్లాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షానికి వారి సొంత పరిమితులు ఉంటాయని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా ఒక భాగమని గుర్తు చేశారు. కలిసి చర్చించుకుని ముందుకు సాగుతామని జైరాం రమేశ్ స్పష్టం చేశారు.