ఢిల్లీ ప్రశాంత్​ విహార్​ వద్ద పేలుడు

దర్యాప్తు చేపట్టిన పేలుడు

Nov 28, 2024 - 14:05
 0
ఢిల్లీ ప్రశాంత్​ విహార్​ వద్ద పేలుడు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని ప్రశాంత్​ విహార్​ పీవీఆర్​ సమీపంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ పేలుడుకు సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి ఎన్​ ఐఎ, బాంబు, డాగ్​ స్క్వాడ్​ లను కూడా రంగంలోకి దింపారు. సమాచారం అందించిన వ్యక్తి ప్రశాంత్​ విహార్​ లోని బన్నీ స్వీట్స్​ అనే దుకాణంలో పేలుడు జరిగిందని పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖలు రంగంలోకి దిగారు. ఇక్కడ ఉన్న పార్క్​ వద్ద పేలుడు సంభవించినట్లుగా గుర్తించాయి. ఈ ప్రాంతంలో తెల్లటి పౌడర్​ ను గుర్తించారు. ఫోరెన్సిక్​ బృందం ఆధారాలను సేకరించింది. ఫోన్​ చేసిన వ్యక్తిపై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా పుకార్లను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు కూడా ఢిల్లీలోని ఓ స్కూల్​ బయట సరిహద్దు గోడవద్ద ఇలాంటి పేలుడే సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ పేలుడుకు ఆ పేలుడుకు దగ్గరి పోలికలున్నట్లు కనుగొన్నామన్నారు. అక్కడ జరిగిన పేలుడులో స్థానికంగా ఉన్న పలు వాహనాలు, ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం జరిగిన ఈ పేలుడు తీవ్రత అంతగా లేదన్నారు. పేలుడుపై పూర్తి వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కాగా పేలుడు సందర్భంగా ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగలేదని పోలీసులు తెలిపారు.