ప్రతీఒక్కరూ ఓటేయ్యాలి
అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ ఓటు ద్వారానే బలమైన పునాది నిర్మాణం వయొనాడ్ ను వదిలి మరో స్థానంలోకి యువరాజు ప్రయాణం తప్పదు తొలివిడతలో పూర్తి అనుకూల ఫలితాలు కాంగ్రెస్, కూటమికి ముచ్చెమటలు యువరాజును వదలని కూటమి పార్టీలు కాంగ్రెస్, కూటమిలో సఖ్యతే లేదు నాందేడ్ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ దేశానిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ సైనికులు ఎండా, వాన, చలి లెక్క చేయకుండా సరిహద్దుల్లో పహారా కాయగా లేంది మనం ఎన్నికల్లో వందకు వంద శాతం పాల్గొని ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమా? అని ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ విధిగా ఓటు వేయాలని ప్రధాని సూచించారు. ఇక వయొనాడ్ ను కూడా యువరాజు వదలనున్నారని, 26 ఏప్రిల్ రెండో విడత ఎన్నికల ద్వారా ఇది తేలిపోతుందని, మరోచోట నుంచి పోటీకి దిగే యోచనలో కూడా ఉన్నారని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ మోదీ విమర్శించారు.
తొలివిడత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అనుకూల పలితాలు వస్తాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్, కూటమి పార్టీలు మట్టి కరుచుకుపోతాయన్నారు. కాంగ్రెస్, కూటమిలో ఎవరు దేశాన్ని ఏలుతారనే విషయాన్ని చెప్పకుండా ఎన్నికల్లో దిగడాన్ని ప్రజలు వ్యతిరేకించారన్నారు. దేశం తమ చేతిలో సురక్షితంగా ఉంటుందని భరోసా కల్పించామని అందుకే ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
మహారాష్ర్ట నాందేడ్ లో జరిగిన ఎన్నికల సభలో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. తొలివిడత ఎన్నికలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్కువ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతీ ఓటు కీలకమని తెలిపారు. 140 కోట్ల మంది ఉన్న భారతదేశంలో దేశభవిష్యత్ కు భరోసా కల్పించేందుకు ఓటు వేయాలని సూచించారు. ఓటింగ్ శాతంలో తగ్గుదల నమోదవడం దురదృష్టకరమని తెలిపారు. ఏ పార్టీలు గెలుస్తాయనేది ముఖ్యం కాదని ఓటింగ్ మాత్రం వంద శాతం అయ్యేలా ప్రతీ పార్టీల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. రానున్న ఆరు విడతల ఎన్నికల్లో ఇందుకు దేశవాసులంతా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ దేశ సైనికులు ఎండకు, వానకు, చలికి భయపడకుండా సరిహద్దుల వద్ద కాపలా కాయగా లేంది. దేశ పౌరులుగా ఒక్క ఓటు వేసేందుకు మనకు ఇంత జంకు, బొంకు ఎందుకని ప్రశ్నించారు. దేశ ఖ్యాతి ప్రపంచం నలుమూలలా ప్రసరిస్తున్న ఈ వేళ అతి పెద్ద ప్రజాస్వామ్యం భారత్ అని నిరూపించుకునే అవకాశం వచ్చిందన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, కూటమి పార్టీల నేతలు వారిలో వారే తిట్టుకునే వరకు వెళుతున్నారని మోదీ విమర్శించారు. ఇక వీరు దేశాన్ని ఏం ఏలుతారని ప్రశ్నించారు. ప్రజలు ఎప్పుడో కూటమి పార్టీలను తిరస్కరించారన్నారు. చాలామంది నాయకులు ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలంటే భయపడి దొడ్డిదారిన రాజ్యసభలో అడుగు పెడుతున్నారని వివరించారు. కూటమిలో వారికి వారే తిట్టిపోసుకుంటున్నారని పేర్కొన్నారు. చివరికి కూటమి యువరాజుపై కూడా కేరళలో తీవ్ర విమర్శలు చేశారని ప్రధాని మోదీ తెలిపారు. వారిలో వారికే సఖ్యత లేని వారు ఏం గెలుస్తారని, ఏం నమ్మకంతో ప్రజాసేవ చేస్తారని ప్రశ్నించారు.
రానున్న 25 ఏళ్లు భారత్ కు కీలకంగా నిలవనున్నాయని ప్రధాని వివరించారు. దేశాభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యం ద్వారా బలమైన పునాదిని వేయగలిగితేనే మనం అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా చేరుకుంటామని తెలిపారు. ప్రపంచదేశాల్లో భారత్ కీర్తి ప్రఖ్యాతులు వెల్లివిరుస్తాయని ప్రధాని పేర్కొన్నారు.