‘సర్ప వినాశ్​’తో ఉగ్రవాదుల అంతం

End of terrorists with 'Sarpa Vinash'

Jul 18, 2024 - 19:39
Jul 18, 2024 - 20:24
 0
‘సర్ప వినాశ్​’తో ఉగ్రవాదుల అంతం
  • కేంద్రం పక్కా ప్రణాళిక
  • కార్గిల్​ లో అనుసరించిన విధానాన్ని అనుసరిస్తున్న ఉగ్రవాదులు
  • గుర్తించిన ఇంటలిజెన్స్​ వర్గాలు
  • పీర్​ పంజాల్​ ఎత్తైన కొండలపై భారత్​ సైన్యం
  • ఉగ్రవాదులను తుదముట్టించే ఆపరేషన్​ కు శ్రీకారం


నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: శ్రీనగర్​ నుంచి జమ్మూకు మకాం మార్చి దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదుల అంతానికి కేంద్రం అత్యంత పకడ్భందీ ప్రణాళిక రూపొందించింది. కార్గిల్​ యుద్ధంలో అనుసరించిన విధానాన్ని జమ్మూలో అనుసరిస్తున్న ఉగ్రవాదులు జమ్మూలో విధ్వంసం సృష్టించగలుగుతున్నారని గుర్తించింది. దీంతో కేంద్రం వీరి విధ్వంసానికి విరుగుడు ఆపరేషన్​ ‘సర్ప వినాశ్​’ను ప్రారంభించింది. 

ఏంటీ సర్ప వినాశ్​..

జమ్మూలోని అత్యంత ఎత్తైన పర్వతం పీర్​ పంజాల్​. ఈ పర్వత ప్రాంతం నలువైపులా దట్టమైన అటవీ ప్రాంతం. దీంతో ఈ పర్వతం పై నక్కిన ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి వచ్చి జమ్మూలో దాడులకు తెగపడుతున్నారు. దీనికి తోడు వారికి స్లీపర్​ సెల్స్​ కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటలిజెన్స్​ వర్గాలు కేంద్రానికి పూర్తి సమాచారాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి చర్చల అనంతరం ‘సర్ప వినాశ్​’ ఆపరేషన్​ ను చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ ఆపరేషన్​ ప్రకారం పీర్​ పంజాల్​, జమ్మూలోని ఎత్తైన పర్వతాలపై భారత సైనికులను మోహరించనున్నారు. వీరి కదలికలను ఎప్పటికప్పుడు వైమానిక రంగం ద్వారా పర్యవేక్షించనున్నారు. దీంతో పాక్​ వైపు నుంచి ఈ ఎత్తైన ప్రాంతాలకు వచ్చే ఉగ్రవాదులను జమ్మూ ప్రాంతానికి చేరుకోకముందే వారి ప్రాంతాల్లోనే మట్టుబెట్టనున్నారు. ఈ ప్రణాళిక కార్గిల్​ యుద్ధంతో పోలి ఉండడం విశేషం. 

మరోవైపు కొండ దిగువన అటవీ ప్రాంతం, కొండగుహాల్లో సెర్చింగ్​, కూంబింగ్​ దళాలు తమపని చేపట్టనుండగా, ఇక స్లీపర్​ సెల్స్ పని పట్టేందుకు జమ్మూలోని అన్ని సరిహద్దు గ్రామాలను అణువణువునా శోధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

1990లో ఇదే తరహా ఆపరేషన్​ ను చేపట్టి ఆర్మీ విజయాన్ని సాధించింది. అప్పట్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా జమ్మూలో తుదముట్టించింది. యాంటీ టెర్రరిస్ట్​ గ్రిడ్​ ను తయారు చేసింది. ఉగ్రవాదం జాడలు తగ్గిపోయాక సైన్యం మోహరింపు తగ్గింది. కానీ ప్రస్తుతం సైన్యం మోహరింపు లేకపోవడంతో ఈ ఉగ్రవాదులు జమ్మూను తమ లక్ష్యంగా ఎంచుకొని విజృంభిస్తున్నారు. ఇదే అంశాన్ని కేంద్రం పసిగట్టింది. ఇక నిరంతరం జమ్మూను కూడా ‘సర్ప వినాశ్​’ ఆపరేషన్​ ద్వారా ఉగ్రవాద మూలాల్ని పెకిలించనుంది.

ఇప్పటికీ 40మంది పీవోకేలో శిక్షణ పొందిన ఉగ్రవాదుల మాడ్యూల్​ జమ్మూలో నక్కి ఉన్నట్లు ఇంటలిజెన్స్​ వర్గాలు గుర్తించాయి. వీరికి తిరిగి వెళ్లే దారి లేకపోవడంతో అంతర్గతంగా అలజడి సృష్టిస్తున్నట్లు గుర్తించాయి. 

‘సర్ప వినాశ్​’ ఆపరేషన్​ ద్వారా మోహరింపును ఆర్మీ ఉన్నతాధికారులు ఇప్పటికే వ్యూహాత్మకంగా చేపడుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో భద్రతా బలగాలు పూర్తి జమ్మూ సరిహద్దును తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. దీంతో అంతర్గతంగా నక్కి ఉన్న ఉగ్రవాదుల పని పట్టనున్నారు. మరోవైపు ఉగ్రవేట కోసం అత్యాధునిక డ్రోన్లు, స్నిఫర్​ డాగ్​ ల సహాయం కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారత సైన్యం ఆపరేషన్​ ను నిధానంగాన ప్రారంభిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఉగ్రవాదులపై పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపనున్నట్లు తెలుస్తోంది.