కల్తీ నాటుసారా మృతులపై సీబీఐ విచారణ
గవర్నర్ కు ఏఐఏడీఎంకే పళనిస్వామి వినతిపత్రం
చెన్నై: తమిళనాడు కళ్లకురిచిలో కల్తీ నాటుసారా మృతులపై సీఎం స్టాలిన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శ కె. పళనిస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని రాజ్ భవన్ లో కలిశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం పళనిస్వామి విలేకరులతో మాట్లాడారు. కల్తీ మద్యం ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెలుగుచూసేందుకు ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. అటవీశాఖాధికారులను కూడా విచారించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబీసీఐడీ రాష్ర్ట సంస్థతో విచారణ జరపడం ద్వారా తమ తప్పులను కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో స్టాలిన్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఏకసభ్య కమిషన్ విచారణతో వాస్తవాలు వెలుగులోకి రావని, ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. సీబీఐ విచారణ కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించామని పళని స్వామి తెలిపారు. కాగా మంగళవారానికి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 60కి పైగా చేరుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.