మహాకుంభమేళాకు 30 దేశాల నుంచి భక్తులు
Devotees from 30 countries attend the Maha Kumbh Mela

భారీ బందోబస్తు నడుమ సంగమ స్నానాలు
సీఎం నివాసం నుంచే భద్రత పర్యవేక్షణ
లక్నో: వసంత పంచమి సందర్భంగా ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో భారీగా భక్తులు హాజరవుతున్నారు. సోమవారం ఒక్కరోజే మూడుకోట్లమందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించినున్నట్లు అధికారులు తెలిపారు. గత 20 రోజులుగా 35 కోట్లకు పైగా మంది పుణ్య స్నానాలాచరించారు. 30 దేశాల నుంచి భారీ ఎత్తున భక్తులు సంగమ స్నానాలకు వస్తున్నారు. కాగా వీవీఐపీ, వీఐపీ పాస్ లు రద్దు చేశారు. సంగమ స్నానానికి పది కిలోమీటర్ల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకొని యూపీ ప్రభుత్వం ప్రత్యేక భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. స్నానఘట్టాల వద్ద మరిన్ని బారికేడ్లను ఏర్పాటు చేసింది. భక్తులు త్వరగా స్నానాలు ముగించుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లింది. అదే సమయంలో ప్రయాగ రాజ్ కు దారితీసే పలు దారులను వన్ వే చేశారు. అడుగడుగునా పోలీసులు, భద్రతా దళాలు కూడా క్యూలైన్లను పర్యవేక్షిస్తూ భక్తులను పుణ్య స్నానాలకు పంపిస్తున్నారు.
13 అఖారాలకు చెందిన నాగసాధువులు త్రివేణి సంగమంలో స్నానాలాచరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వీరిపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించింది. రద్దీ దృష్ట్యా దగ్గరలో ఉన్న పలు ఆలయాలను మూసివేశారు. 60వేల మంది పోలీసులు, భద్రతా బలగలు వందమంది ప్రత్యేకాధికారులు, 2750 సీసీటీవీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీనియర్ అధికారులు వేకువజాము 3 గంటల నుంచే సీఎం యోగి నివాసంలో కూర్చొని భద్రతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చేస్తున్నారు.