చొరబాటుదారులతో రాజకీయ ముఖచిత్రంలో మార్పు
బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఆరోపణ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారుల కారణంగా ఢిల్లీ లో ముస్లిం జనాభా పెరిగిందని దీంతో రాజకీయ ముఖ చిత్రం మార్చే ప్రయత్నం జరిగిందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. షాహీన్ బాగ్, ఖాన్ మార్కెట్, సీలంపూర్ లలో గత 15ఏళ్ల క్రితం ఉన్న జనాభా నిష్పత్తిలో తేడా వచ్చిందన్నారు. చొరబాట్లపై జెఎన్ యూ (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) 114 పేజీల నివేదికను సమర్పించారని చెప్పారు. జనాభాలో వృద్ధి అత్యంత రహాస్యంగా జరుగుతుందని నివేదికను గమనిస్తే తెలుస్తుందన్నారు. దీంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో కూడా మార్పు వస్తుందన్నారు. పూర్వాంచల్ ప్రజల ఉద్యోగాలకు బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు పోటీగా మారారన్నారు. చొరబాటుదారులనే ఓటర్లుగా మారుస్తూ లబ్ధి పొందుతున్నారన్న సమాచారం ఉందన్నారు. దీంతో నేరాలు పెరిగేందుకు ఇది ఒక కారణంగా నిలుస్తుందన్నారు. జెఎన్ యూ ప్రొఫెసర్ మనురాధ చౌదరి నేతృత్వంలో పలువురు పరిశోధకులు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారని తెలిపారు. నివేదిక ప్రకారం, ఈ చొరబాటుదారులు నివసిస్తున్న ఢిల్లీ ప్రాంతాలలో సీలంపూర్, జామియా నగర్ (షాహీన్ బాగ్), జాకీర్ నగర్ (ఓఖ్లా), లజ్‌పత్ నగర్, కైలాష్ నగర్, ఖిచ్దీపూర్, సరాయ్ కాలే ఖాన్, సుల్తాన్‌పురి, ముస్తఫాబాద్, నిజాముద్దీన్, సరాయ్ రోహిల్లా ఉన్నాయి. జాఫ్రాబాద్, ఖాన్ మార్కెట్, షాహదారా, భల్స్వా డైరీ, బవానా, ద్వారక, రోహిణి, మోతీ నగర్, గోవింద్‌పురిల్లో చొరబాటుదారులు తిష్ఠవేశారని సంబిత్ పాత్ర స్పష్టం చేశారు.