ఈసీ నియామకంలో జోక్యం చేసుకోలేమన్న కోర్టు
పిటిషన్ కొట్టివేత కేంద్రం ప్రభుత్వం, ఈసీకి ఊరట
నా తెలంగాణ, ఢిల్లీ: ఇద్దరు ఎన్నికల అధికారుల నియామకంపై తాము స్టే విధించలేమని, ఇందులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లు కాంగ్రెస్ నాయకుడు జయఠాకూర్ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి ఊరట లభించినట్లయింది. గందరగోళానికి తెరవీడింది. ఈ క్రమంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సుప్రీం సమర్థించింది. ఇటీవల మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధులు ఎన్నికల కమిషనర్‌లుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే వారి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ దశలో నియామకాలను నిషేధించడం ఎన్నికలపై ప్రభావం చూపడమే కాకుండా అరాచకం సృష్టిస్తుందని కోర్టు తన తీర్పులో తెలిపింది. అయితే నియామక ప్రక్రియపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఇంత హడావుడిగా ఎందుకు చేశారంటూ ప్రశ్నించింది. నియామక ప్రక్రియను స్వీకరించడానికి మరికొంత సమయం ఇవ్వాలని, తద్వారా ప్రక్రియను మెరుగైన పద్ధతిలో పూర్తి చేయవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు సమాధానమిస్తూ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికారుల నియామకం అనివార్యమైనందునే ముందుచూపుతో వ్యవహరించి కమిషనర్ల నియామకం ప్రక్రియ ప్రకారమే చేపట్టామని కోర్టుకు వివరించింది.