హిసార్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చే కుట్ర
చండీగఢ్: రైతులు, యువకులను కాంగ్రెస్ మోసం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. శనివారం హరియాణాలోని హిసార్ ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. అక్టోబర్ 5న 90 స్థానాలకు గాను అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాల వల్ల దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. తప్పుడు హామీలతో రైతుల ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అవినీతి, లంచాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా అవినీతి చోటు చేసుకునేదన్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకువచ్చామన్నారు.
హిమాచల్ లో వాగ్ధానాలు తుంగలో తొక్కారు..
హిమాచల్ లో కూడా ఇలాంటి అబద్ధాలే చెప్పిందని ఆ ప్రాంతానికి ఏం చేసిందని నిలదీశారు. కాంగ్రెస్ తన వాగ్ధానాలను తుంగలో తొక్కిందన్నారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి కోసం ఏకంగా తండ్రీ కొడుకుల మధ్యనే పోటీ జరుగుతుందని తెలిపారు. సొంత నేతలను ఏకం చేయలేని ఈపార్టీ రాష్ర్టానికి ఏం మేలు చేస్తుందని విమర్శించారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ లో హామీలను తుంగలో తొక్కిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రైతులకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయే అన్నారు.
మిర్చ్ పూర్ ఘటన ఎవరి హయాంలో జరిగింది?..
దళితులకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ మాత్రం తలుపులు మూసేస్తోందన్నారు. వారిని చిత్రహింసలు పెట్టినా మౌనం ఎందుకు వహించారని నిలదీశారు. మిర్చ్ పూర్ ఘటన ఎవరి హయాంలో జరిగిందని ప్రశ్నించారు. ఆ పార్టీ తమకు తాము రాజకుటుంబం మాదిరి వ్యవహరిస్తోందన్నారు. రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలను దళితులను ఎన్నటికీ మరిచిపోరాదని మోదీ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగాల కోసం నిరుపేదలు భూములను సైతం లంచంగా ఇచ్చిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. దేశ యువత కలలను కల్లలు చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకోవద్దు..
హరియాణా ప్రజలు దేశంపై లేనిపోని అపోహలు, అసత్యాలు మాట్లాడితే ఉరుకోబోరన్నారు. రాహుల్ గాంధీ విదేశాల్లో కూర్చొని దేశ అస్థిరతకు భంగం వాటిల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని తీసుకురావాలని, జమ్మూకశ్మీర్ లో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించాలని, ఉగ్రవాదులను విడిచిపెట్టాలని ఆ పార్టీ కోరుకుంటుందన్నారు. హరియాణా ప్రజలు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకోవద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.