బండిపై వ్యాఖ్యలు సహించం
Comments on the cart are not tolerated
బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్
నా తెలంగాణ, హైదరాబాద్: సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకొని కేంద్రమంత్రి బండి సంజయ్ ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
దళితులకు ఆరాధ్యుడైన బీఆర్ అంబేద్కర్ జన్మస్థలానికి వెళ్లే అర్హత కూడా ఆ పార్టీ నాయకులకు లేదని విమర్శించారు. అడుగడుగునా అంబేద్కర్ ను అవమానపర్చింది హస్తం పార్టీయే అన్నారు. చట్టసభల్లో రానీయకుండా ఆయన్ను అడ్డుకున్న వారు వీరేనన్నారు. ఆర్టికల్ 370, మహిళల హక్కుల సాధన, సమాన పనికి సమాన వేతనంపై అంబేద్కర్ అభిప్రాయాలతో విబేధించిన పార్టీ కాంగ్రెస్ నాటి ప్రధాని నెహ్రూ అని తెలుసుకోవాలన్నారు. దీంతో బాబాసాహెబ్ కాంగ్రెస్ ను వదిలి బయటకొచ్చారని స్పష్టం చేశారు. ఆయనకు భారతరత్న సైతం ప్రదానం చేయలేదని దుమ్మెత్తిపోశారు. అద్వానీ, వాజ్ పేయి డిమాండ్ తోనే అంబేద్కర్ కు భారతరత్న లభించిందన్నారు. వరుసగా మూడుసార్లు బీజేపీ అధికారంలోకి రావడంతో హస్తం పార్టీకి మింగుడుపడడం లేదని కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఎస్సీ, గిరిజన అభ్యర్థులెందరున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే రాజ్యాంగంపై మాటలను వల్లేవేస్తుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అంబేద్కర్ పంచతీర్థాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిందని, ఆ పనిని కాంగ్రెస్ ఎందుకు చేయలేక చతికిలపడిందని నిలదీశారు.
మొగిలయ్య, రాంచంద్రయ్య, కొండప్ప, గడ్డం సమ్మయ్య, వనజీవి రామయ్య లాంటి అతి సామాన్యమైన వ్యక్తులకు కూడా అత్యున్నత పురస్కారాలను బీజేపీ అందజేసిందన్నది గుర్తు పెట్టుకోవాలన్నారు. గులాంనబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ, ఎల్.కె. అద్వానీ, ములాయం సింగ్ లకు కూడా భారతరత్నలను ప్రదానం చేసి తమ ప్రభుత్వం వివక్షలకు తావీయదని నిరూపించుకుందన్నారు.
గద్దర్ ను ఇదే బీఆర్ఎస్ పార్టీ కనీసం గేటు కూడా దాటనీయలేదని గుర్తు చేశారు. ఆయన వినతిపత్రం కూడా స్వీకరించలేదన్నారు. ఆయనపై కేసులు బనాయించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలుసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపై మాట్లాడే నైతిక హక్కు హస్తం పార్టీకి లేదని కేంద్రమంత్రులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప తదితర నాయకులు పాల్గొన్నారు.