ట్రంప్ కు లియాంగ్ షాక్
ఎన్విడియా, ఎఐలకు ధీటుగా డీప్ సీక్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు చైనీస్ లియాంగ్‘ డీప్ సీక్’ షాక్ తగిలింది. అమెరికా చాట్ జీపీటీ, ఓపెన్ ఎఐలు చైనా డీప్ సీక్ దెబ్బకు భారీగా నష్టపోయాయి. ఈ భయంతోనే అమెరికా చైనా మైక్రో చిప్ ల ఎగుమతులను రద్దు చేసింది. అయినా చైనా డీప్ సీక్ దెబ్బకు పలు బడా సంస్థలు సైతం వణికిపోయాయి. ఈ సంస్థ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ ఫెంగ్ (40). చూసేందుకు సన్నగా, చింపిరి జుట్టుతో ఉన్న ఇతను ఆది నుంచే సాంకేతికతపై మంచి పట్టు సాధించాడు. 2021లో వెన్ ఫెంగ్ అమెరికా స్టార్ టెక్ సంస్థ ఎన్విడియాకు చెందిన వేలాది గ్రాఫిక్స్ ప్రాసెసర్లను కొనుగోలు చేశాడు. దీన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ విషయాన్ని కూడా మరిచిపోయారు. ఆ సంస్థ ప్రాసెసర్లకు ధీటుగా డీప్ సీక్ ప్రాసెసర్లను రూపొందించడంలో విజయం సాధించాడు. తన సృష్టికి జనవరి 27 ముహూర్తం ఖరారు చేసి డీప్ సీక్ ను విడుదల చేశాడు. దీంతో ఒక్కసారిగా అమెరికన ఎన్విడియా, ఓపెన్ ఎఐ సంస్థలకు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ సంస్థలు రూపొందించిన చాట్ జీపీటీ, ఓపెన్ ఎఐల కంటే చైనాకు చెందిన డీప్ సీక్ ధర తక్కువగా ఉండడంతో అమెరికా సంస్థలకు 600 బిలియన్ డాలర్ల భారీ నష్టం వాటిల్లింది.
చైనాలోని ఝాంజియాంగ్ లో జన్మించిన లియాంగ్ వెన్ ఫెంగ్ చదువులో చురుకుగా వ్యవహరించేవాడు. 2007 బెజియాంగ్ యూనివర్సిటీ నుంచి ఐటీ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడయ్యాడు. 2010లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ట్రాకింగ్ అల్గారిథమ్ ను కూడా ఇతను కనుగొన్నాడు. తన ఆవిష్కరణ కోసం పీటీజడ్ అనే తక్కువ ధర కలిగిన కెమెరాలను ఉపయోగించాడు. 2013లో హాంగ్‌జౌ యాకేబీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని స్థాపించాడు. 2015లో జెజియాంగ్ జియుజాంగ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీని స్థాపించాడు. డీప్‌సీక్ కంపెనీ 2023లో ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ రంగంలో లియాంగ్ ప్రతిభను చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది.