ఎంజీఎన్ ఆర్ ఈజీఎ చెల్లింపులు రూ. 86వేల కోట్లు
గత దశాబ్దంలో మోదీ ప్రభుత్వం కీలక చర్యలు

కార్మికుల సంఖ్య 13.45 కోట్లకు పెరుగుదల
నేరుగా చెల్లింపులతో గ్రామీణ ఉపాధిలో పెరుగుదల
వందరోజుల పనిదినాలు.. ఖాతాల్లోనే డబ్బు జమ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎంజీఎన్ ఆర్ ఈజీఎ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) కింద గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న సంస్కరణలు, పాదర్శక విధానం, సమ్మిళిత భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల జీవనాధారం గణనీయంగా మెరుగుపడుతుంది. 2005లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినా, గత పదేళ్లు అధిక వృద్ధిని సూచిస్తుంది. అంతేగాక ఇంతకుముందు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలకు కేంద్రం ఈ పథకం కింద చెల్లింపులు చేస్తున్నా వేరే రకమైన అవసరాలకు ఈ నిధులను వాడుకునే వారు. ఈ విధానానికి చెక్ పెడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం వందకు వంద శాతం ఆధార్ కార్డు ద్వారా చెల్లింపులను చేస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన మెరుగవడమే గాకుండా నేరుగా ఏడాదికి వందరోజులపాటు పనిదినాలకు సంబంధించిన వేతనం వారి వారి ఖాతాల్లోనే జమవుతుంది.
రూ. 2,13,220 కోట్లు విడుదల..
2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ. 33,000 కోట్లుగా ఉండగా, 2024–25 వరకు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 86వేల కోట్లకు చేరుకుంది. అంటే మోదీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ఉపాధి కల్పనకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారనే విషయం అర్థమవుతుంది. 2020–21లో కీలకమైన కోవిడ్ –19 సమయంలో, గ్రామీణ జనాభాను ఆదుకునేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఏకంగా ఈ పథకం కింద రూ. 1,11,000 కోట్లను కేటాయించడం గమనార్హం. మెరుగైన ప్రయత్నాలతో 2024–25 నాటికి 3,029 కోట్ల పనిదినాలను కల్పించింది. ఇది 82 శాతం పెరుగుదలను సూచిస్తుంది. అదే సమయంలో ఈ పథకం కింద గత దశాబ్దంలో రూ. 2,13,220 కోట్లను విడుదల చేసింది. ఈ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కార్మికుల ఆర్థిక భరోసా కల్పించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో 8.07 కోట్ల మందికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరింది. పెరుగుదల శాతంతో పోల్చుకుంటే 526 శాతాన్ని సూచిస్తుంది. 2013–14లో ఈ పథకం కింద 48 శాతం ఉన్న మహిళల భాగస్వామ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 58 శాతానికి పెరిగింది. 266 రకాల పనులు, 150 వ్యవసాయ అనుబంధ పనులు, 58 సహజ వనరుల పనులు, 58 గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ఈ పథకం కింద నిర్వహిస్తుంది.
ఎన్ ఎంఎంఎస్ ఆధార్ ఆధారిత చెల్లింపులు..
ఇక చెల్లింపు వ్యవస్థను మోదీ ప్రభుత్వం పటిష్ఠం చేసింది. దీనికింద నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) ద్వారా నేరుగా ఆధార్ ఆధారిత చెల్లింపులను చేస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికుల ఆందోళనలను తగ్గించగలిగింది. ప్రస్తుతం ఎంజీఎన్ఆర్ ఇజీఎ లో 13.45 కోట్ల మంది కార్మికులున్నారు. 2014లో ఈ సంఖ్య కేవలం 76 లక్షలకు పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మికుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుతం ‘నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎన్ ఇఎఫ్ఎంఎస్) ఈ పథకంలో అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పథకంగా మారింది. వేతన చెల్లింపులు వందకు వంద శాతం ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు.