పిచ్చుక.. పిచ్చుక నువ్వెక్కడా?

Sparrow.. Sparrow, where are you?

Mar 19, 2025 - 18:40
 0
పిచ్చుక.. పిచ్చుక నువ్వెక్కడా?

మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: పర్యావరణాన్ని కాపాడడంలో పిచ్చుకలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాటి సంఖ్యలో గణనీయమైన తగ్గుదల ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం నగరాల్లో ‘పిచ్చుక పిచ్చుక నువ్వెక్కడా’ అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా పలువురు పర్యావరణ ప్రేమికులు, ప్రభుత్వాలు వీటి సంఖ్య పెరుగుదలపై మాట్లాడుతున్న తీసుకోవాల్సిన చర్యలు మాత్రం బుట్టదాఖలవుతున్నాయనే ఆరోపణలున్నాయి. పిచ్చుల తగ్గుదలకు వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, కాలుష్యం, అటవుల తగ్గుదల, చెట్లను నరకడం లాంటివి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న వీటి సంఖ్య రోజురోజుకు తగ్గుతుండడంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

2017లో సేవ్​ ది స్పారోను ప్రారంభించిన ప్రధాని మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పలుమార్లు పిచ్చుకల సంఖ్య తగ్గింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. నగరాల్లో ఎక్కడా పిచ్చుకలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవవైవిధ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న వీటి సంఖ్య పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టణాల్లోని నేటితరం పిల్లలు పిచ్చుకలను ప్రత్యక్షంగా చూసిన అనుభవమే లేకపోవడం విచారకరమన్నారు. వాటిని ఫోటోల్లో, వీడియోల్లో చూపించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పర్యావరణ ప్రేమికులే గాకుండా, ప్రజలు కూడా వీటి సంఖ్య పెరుగుదలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో ఎంతోమంది పిచ్చుకల ప్రేమికులు నిర్వహిస్తున్న సేవలను కొనియాడారు. 2017లో ‘సేవ్​ ది స్పారో’ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనతికాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రధాని పిలుపు మేరకు చాలామంది ఔత్సాహికులు తమ తమ ఇళ్ల పరిసరాల్లో పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేశారు. 

స్పారో ఎంపీ బ్రిజ్​ లాల్​..
రాజ్యసభ ఎంపీ బ్రిజ్​ లాల్​ ను చెప్పుకోవచ్చు. ప్రధాని పిలుపునకు స్పందించిన ఆయన ఏకంగా తన ఇంటి ప్రాంతంలో పిచ్చుకల కోసం 50 గూళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆయన ఇంటిచుట్టూ పిచ్చుకల కిలకిలారావాలు వినిపిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తుంటారు. స్థానికులు ఈయన్ను స్పారో ఎంపిగా కూడా పిలవడం గమనార్హం. 

మానవుడు–పిచ్చుకల మధ్య11వేల ఏళ్ల బంధం..
2010లో ‘నేచర్​ ఫరెవర్​’ అనే పక్షి సంరక్షణ బృందం ప్రారంభించిన పిచ్చుకల దినోత్సవం ఏటా మార్చి 20న నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న దేశాల సంఖ్య 50కి పెరిగింది. పంటలపై కీటకాలను నివారించడం, పూల పెంపకంలో పరాగ సంపర్కంలో సహాయపడటం లాంటి వాటికి పిచ్చుకలు దోహదం చేస్తున్నాయి. కాగా ఒక నివేదిక ప్రకారం మానవులు, పిచ్చుకల మధ్య సంబంధం 11వేల సంవత్సరాల నాటిదని ఋజువైంది. పచ్చదనం పెంపుదల, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం, పిచ్చుకలకు సురక్షితమైన ఇళ్లు (గూళ్లు) సృష్టించడం వంటి చిన్న చిన్న చర్యలతోనే పిచ్చుకల సంఖ్యలో పెరుగుదలకు దోహదపడుతుంది.