పాడిపరిశ్రమకు రూ. 2,790 కోట్లు

ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్​ భేటీలో కీలక నిర్ణయాలు

Mar 19, 2025 - 17:53
 0
పాడిపరిశ్రమకు రూ. 2,790 కోట్లు

రాష్ట్రీయ గోకుల్​ మిషన్​ కు రూ. 3400 కోట్లు
అసోంలో ఎరువుల ఫ్యాక్టరీకి రూ. 10,601.40 కోట్లు
యూపీఐ లావాదేవీలపై చార్జీలు నిల్​ 

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పాడిపరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం (ఎన్​ పీడీడీ)కి అదనంగా రూ. 2,790 కోట్లు, రాష్ర్టీయ గోకుల్​ మిషన్​ (ఆర్జీఎం)కు రూ. 3400 కోట్లు, అసోంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రాజెక్టుకు రూ. 10,601.40 కోట్లు, పగోటా–చౌక్​ రహదారి నిర్మాణానికి రూ. 4500 కోట్లను అందించేందుకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్​ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతోపాటు బీమ్​ యూపీఐ తక్కువ లావాదేవీలపై పీ2ఎం (వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే లావాదేవీలు) ఎలాంటి చార్జీలు విధించొద్దని నిర్ణయించారు. కేబినెట్​ నిర్ణయాలను బుధవారం సాయంత్రం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​ మీడియాకు వివరించారు.

ఎపీడీడీ: పాడిపరిశ్రమ అభివృద్ధి కార్యక్రమానికి రూ. 2,790 కోట్లను అందించాలని నిర్ణయించింది. ఈ నిధులతో పాడిపరిశ్రమలో మౌలిక సదుపాయాలు, ఆధునీకరణ, విస్తరణ, స్థిరమైన వృద్ధి, ఉత్పాదకత కోసం వినియోగించనున్నారు. రైతులకు మార్కెట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ధరలను పెంచేందుకు, సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పాడిపరిశ్రమ రైతులు ఆర్థికంగా బలపడనున్నారు. పాల శీతలీకరణ ప్లాంట్ల నిర్మాణం, ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఈశాన్య ప్రాంతం (ఎన్​ ఇఆర్​), కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ)ల్లో పాలసేకరణ, పాల ఉత్పత్తిదారుల సంస్థలు బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్​ర్టాల్లో కూడా పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పాడి సహకార సంఘాల స్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నారు. ఎన్​ పీడీడీ ద్వారా ఇప్పటికే 18.74 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేగాక ప్రత్యక్షంగా 30వేల మంది, పరోక్షంగా మరో 30వేల మందికి ఉపాధి లభిస్తుంది. 

రాష్ట్రీయ గోకుల్​ మిషన్​ (ఆర్జీఎం): రాష్ట్రీయ గోకుల్​ మిషన్​ కు కేంద్ర కేబినెట్​ అదనంగా మరో రూ. 3400 కోట్లను కేటాయించింది. ఈ మిషన్​ కింద పశుసంవర్థక రంగంలో వృద్ధిని పెంచనున్నారు. ఆవుల పెంపక కేంద్రాలకు సహాయం, ఆవులను కొనేందుక రైతులను ప్రోత్సహించడం, కొన్నవారిని నేరుగా పాలరైతు సంఘాలతో అనుసంధానించడం, బ్యాంకుల నుంచి కొనుగోలుకు తీసుకున్న రుణంపై 3 శాతం వడ్డీ రాయితీని అందించాలని నిర్ణయించారు. దీంతో పశువుల సంఖ్యలో పెరుగుదల నమోదు చోటు చేసుకోనుంది. ఈ నిధులతో పశు వీర్య కేంద్రాలు, కృత్రిమ గర్భధారణ నెట్​ వర్క్​, ఎద్దుల ఉత్పత్తి కార్యక్రమం అమలు, మేలైన జాతుల ఉత్పత్తి, నైపుణ్య అభివృద్ధి,రైతులకు అవగాహన కేంద్రాలు, పశు పెంపకం రైతులను బలోపేతం చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక గత పదేళ్లలో పాల ఉత్పత్తిలో 63.55 శాతం పెరిగింది. 605 జిల్లాల్లో ఎన్​ ఎఐపీ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం అమలు చేస్తుంది. దీంతో 5.21 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. 

బీవీఎఫ్​ సీఎల్​: అసోంలోని నమ్రప్​ లో ఇప్పటికే ఉన్న బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ ప్రాంగణంలో మరో కొత్త అమ్మోనియా యూరియా కాంప్లెక్స్​ ను నిర్మించనున్నారు. ఇందుకు గాను రూ. 10,601.40 కోట్లను కేబినెట్​ ఆమోదం తెలిపింది. నూతన యూనిట్​ ద్వారా 12.7 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయనున్నారు. 70:30 ప్రభుత్వ,ప్రైవేట్​ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.  అసోం ప్రభుత్వం 40 శాతం, బీవీఎఫ్​ సీఎల్​ 11 శాతం, హిందుస్థాన్​ ఉర్వరక్​, రసాయన్​ లిమిటెడ్​ 13 శాతం, నేషనల్​ ఫెర్టిలైజర్స్​ లిమిటెడ్​ 18 శాతం, ఆయిల్​ ఇండియా లిమిటెడ్​ 18 శాతం భాగస్వామ్యం కలిగి ఉండనున్నారు. 

పగోటా–చౌక్​: పగోటా నుంచి చౌక్​ వరకు రూ. 4500 కోట్లతో ఆరు లేన్ల హైవేను విస్తరించాలని కేంద్ర కేబినెట్​ నిర్ణయించింది. ఈ నిర్మాణంతో రాయ్​ గఢ్​ జిల్లాలో కనెక్టివిటీ మెరుగుకానుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంబై-–పూణే ఎక్స్‌ప్రెస్‌వే, పాత ముంబై-–పుణే హైవేలను అనుసంధానించనున్నారు. మొత్తం 29 కి.మీ. హైవే నిర్మాణం 9 నెలల్లో నిర్మించాలని నిర్ణయించింది.