వందల ఏళ్ల గల అతి పురాతనమైన బసవన్న దేవాలయంలో ఘటన
సంఘటన స్థలాన్ని పరిశీలించిన షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్
హిందువుల మనోభావాలను దెబ్బతీయద్దు: బీజేపీ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
విచారణ జరిపిస్తాం: కాంగ్రెస్ నేత మాజీ మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూరు బస్వం
భూపాల్ పల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం
నా తెలంగాణ, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట వివేకానంద కాలనీలో గల బసవన్న దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు శివలింగంను ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. దీంతో చుట్టూ ప్రాంతాలలో ఉన్న స్థానికులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు రావడంతో పట్టణ సీఐ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అగ్గనూర్ బస్వం, గంగముని సత్తయ్య శివలింగాన్ని తదితరులు పరిశీలించారు. గతంలో గర్భగుడిలో లింగం భిన్నం అవగా, కాశీ పుణ్యక్షేత్రం నుండి నూతనంగా తెప్పించిన శివలింగాన్ని దేవాలయంలో ప్రతిష్టించారు. దాంతో భిన్నమైన శివలింగాన్ని బయట పెట్టినట్లు సీఐ ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. బయటపెట్టిన భిన్నమైన శివలింగాన్ని ఎవరు ధ్వంసం చేశారో పోలీసు దర్యాప్తులో తెలుసుకుంటామని సీఐ విజయకుమార్ తెలిపారు. ఎవరైనా కావాలని చేశారా? లేక మద్యం మత్తులో ధ్వంసం చేశారా? అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు సీఐ విజయకుమార్ తెలిపారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
జానంపేట బసవన్న దేవాలయంలో శివలింగం విగ్రహాన్ని దృశ్యం చేసిన వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో అనేక దేవాలయాలను విగ్రహాలను కొందరు దుండగులు అల్లరి మూకలు దాడులు చేస్తుండడం దారుణం. గత కొంతకాలంగా హిందూ దేవాలయ దేవతలపై విపరీతంగా దాడులు జరుగుతున్న ప్రభుత్వాలు గాని పోలీస్ శాఖలు కానీ పట్టించుకోవడం లేదు. కనీస పర్యవేక్షణ కూడా చేయడం లేదు. ఇలాగే కొనసాగితే హిందూ దేవాలయాలకు రక్షణ కరవై పోతుంది.
భూపాల్ పల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం దగ్ధమైన ఘటన కలకలం రేపింది. హనుమాన్ విగ్రహం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి విగ్రహం ధ్వంసమైంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. విగ్రహం దగ్ధం అవడం ఊరికి అరిష్టమంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం దగ్ధం ఘటన కూడా దుండగుల పనేనా అన్న అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో నిజనిజాలు తేల్చాలని హనుమాన్ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.