డోపింగ్ నిరోధకత పాఠ్యాంశాల్లో చేర్చాలి
కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: క్రీడల్లో పారదర్శకత పెంపు, పోటీని ప్రోత్సహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని డోపింగ్ నిరోధకతను పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధిశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా అన్నారు. బుధవారం న్యూ ఢిల్లీలో నిర్వహించిన ఎన్ డీటీఎల్ 2025 (నేషనల్ డోపింగ్ టెస్టింగ్ లాబొరేటరీ) వార్షిక సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. డోపింగ్ నిరోధకతపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన ప్రచారం చేపట్టాలని సూచించారు. నిబంధనలు తెలిపేందుకు క్రీడా సమాఖ్యలు చొరవ తీసుకోవాలన్నారు. క్రీడాకారుల భవిష్యత్ ను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. డోపింగ్ గుర్తింపులో అత్యాధునిక పరిశోధన, సాంకేతికత ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.
నిషేధిత పదార్థాల పరిణామ స్వభావం, ఉద్భవిస్తున్న ముప్పులను ఎదుర్కోవడానికి వ్యూహాలను ఈ సమావేశంలో చర్చించామన్నారు. ఇలాంటి సమావేశాలు, చర్చల్లో యువ క్రీడాకారులు చురుకుగా పాల్గొనాలని, తద్వారా వారి నైతిక క్రీడా పద్ధతుల పట్ల నిబద్ధత ప్రతిబింబిస్తుందని మాండవీయా స్పష్టం చేశారు. ఈ సమావేశం డోపింగ్ రహిత క్రీడా సంస్కృతిని పెంపొందించే దిశగా ముఖ్యమైన అడుగని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయా స్పష్టం చేశారు.