అటల్ కు ప్రముఖుల నివాళులు
Celebrities Tribute to Atal
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వాజ్ పేయి దేశాన్ని ఐక్యతగా ఉంచాలని తపించారని, దేశాన్ని బలోపేతం చేయాలని ప్రయత్నించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం (ఆగస్ట్ 16) మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్థంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. న్యూ ఢిల్లీలో రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉపరాష్ర్టపతి జగదీప్ ధన్‌కర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా బీజేపీ సీనియర్ నేతలు న్యూ ఢిల్లీలోని అటల్ స్మారకం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజాదరణ చూరగొన్న నేత అటల్: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి..
అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మూడుసార్లు ప్రధానిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా, పదిసార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికవడం మామూలు విషయం కాదన్నారు. భారత రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారని అన్నారు. భారత్ ను అణుశక్తి దేశంగా మార్చడంలో అటల్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. కార్గిల్ యుద్ధంలో పాక్ ను మట్టి కరిపించింది కూడా అటల్ హయాంలోనే అని గుర్తు చేశారు.
నాలుగు రాష్ట్రాల నుంచి ఆరు లోక్ సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక రాజకీయ నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అన్నారు. బీజేపీని అట్టడుగు స్థాయి నుంచి అత్యంత ఎత్తుకు ఎదిగేలా చేయడంలో అటల్ భూమిక ఎనలేనిదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీర్తించారు. ఆయనకు నివాళులర్పించారు.