నా తెలంగాణ, నిర్మల్: చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేనిదని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు తదితరులు మయూరి హోటల్ జంక్షన్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించి ఆమె త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో వక్తలు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేనిదని గుర్తు చేశారు. నాటి కాలంలోనే దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణా పోరాటాల చరిత్రలో ఒక గొప్ప అధ్యయనాన్ని లిఖించిందని తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని, ఐలమ్మ లాంటి వీర వనితల చరిత్రను నేటి తరం ప్రజలు తెలుసుకోవాలన్నారు.