మఠాలు, సాదువులపై దాడులు

హిందూ వ్యతిరేక పార్టీ టీఎంసీ దేశ విచ్ఛిన్నానికి కుట్రలు పశ్చిమ బెంగాల్​ ఎన్నికల సభలో ప్రధాని మోదీ

May 29, 2024 - 13:43
 0
మఠాలు, సాదువులపై దాడులు

కోల్​ కతా: బెంగాల్​ లోని మఠాలు, సాధువులు, ఇస్కాన్​, రామకృష్ణమఠం, భారత్​ సేవాశ్రమం వంటి వాటిపై టీఎంసీ గుండాలు దాడులకు పాల్పడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. టీఎంసీ హిందూ వ్యతిరేక పార్టీ, దేశ విచ్ఛిన్న పార్టీ అన్నారు. బుధవారం పశ్చిమ బెంగాల్​ లోని మధురాపూర్​ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. టీఎంసీ అయోధ్య రామాలయాన్ని కూడా అపవిత్రం అంటున్నారని మండిపడ్డారు. దేశ, బెంగాల్​ సంస్కృతిని వీరు ఎప్పటికీ రక్షించబోరన్నది ప్రజలు తెలుసుకోవాలని మోదీ పేర్కొన్నారు. టీఎంసీ, ఇండీ జమాత్​ లు కలిసి దేశ విచ్ఛిన్నానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. 

మత్స్యకారులకు తీవ్ర నష్టం..

కేంద్రం మత్స్యకారుల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే టీఎంసీ ప్రభుత్వం వారికి అందజేయడం లేదన్నారు. దీనివల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ఇప్పటికే రూ. 20 వేల కోట్లు మత్స్యకార సోదరుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించామన్నారు. కానీ ఈ నిధులను టీఎంసీ వారికి అందించడం లేదన్నారు. రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధి చెందిన భారత్​ లో బెంగాల్​ ను కూడా భాగస్వామ్యం చేస్తామని మోదీ గ్యారంటీ ఇచ్చారు. 

నిరుపేదల సంక్షేమం టీఎంసీకి పట్టదు..

60 ఏళ్ల దుష్టపాలనను కూడా బెంగాల్​ ప్రజలు అనుభవించారన్నారు. ఇక తమ పదేళ్ల పాలనలో ఏం జరిగిందన్నది చూశారన్నారు. కానీ బెంగాల్​ పాలనలో ఏం జరుగుతుందో కూడా చూస్తున్నారని మోదీ అన్నారు. టీఎంసీ నిరుపేద సంక్షేమం కోరడం లేదన్నారు. వారికి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందితే వారు తమ మాట వినరని అభివృద్ధికి వెనకడుగు వేస్తోందన్నారు. 

మౌలిక సదుపాయాలనూ వ్యతిరేకిస్తున్నారు..

కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, ఉచిత రేషన్​, గ్యాస్​, ఇంటింటికి నీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను నిరుపేదల అభివృద్ధి కోసం కల్పిస్తుందన్నారు. వీటిని ఏ ప్రభుత్వాలు వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. బెంగాల్​ లో ఇప్పటికీ 18వేల కు పైగా గ్రామాల్లో విద్యుత్​ లేకపోవడం శోచనీయమన్నారు. పరిశ్రమలకు అవకాశాలు కూడా కల్పించడం లేదన్నారు. అభివృద్ధిపై చర్చ జరగడమే టీఎంసీకి ఇష్టం లేదన్నారు. చర్చ జరిగితేనే కేంద్రం మరిన్ని నిధులను బెంగాల్​ అభివృద్ధికి కేటాయించగలదన్నారు. ఇచ్చిన నిధులను ఎటు మళ్లించారో చెప్పరని విమర్శించారు. మమత ప్రభుత్వం నిరుపేదల పాలిట దుష్టపాలన ప్రభుత్వమని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఓటుశక్తితో బీజేపీకి అత్యధిక స్థానాలను కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.