కూటమి వాహనానికి బ్రేకుల్లేవ్​!

మహారాష్ర్ట ఎన్నికల సభలో ప్రధాని మోదీ

Nov 8, 2024 - 15:42
 0
కూటమి వాహనానికి బ్రేకుల్లేవ్​!
డ్రైవింగ్​ సీట్లో కూర్చునేందుకు వారి మధ్యే పోటీ
సేవ చేయాలని తామనుకుంటే, దోపిడీ చేయాలని కొందరొచ్చారు
మోసపూరిత హామీలతో మహిళలు జాగ్రత్త
అభివృద్ధికి ప్రాతిపదిక మహాయుతి మేనిఫెస్టో
ముంబాయి: మహావికాస అఘాడి అనే వాహనంలో ఎలాంటి చక్రాలు లేవు, బ్రేకులు లేవని, డ్రైవింగ్​ సీట్లో కూర్చునేందుకే వారిలో వారే పోరాడుతూ హారన్లు మోగిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. శుక్రవారం మహారాష్ర్టలోని ధూలేలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 
 
మహారాష్ట్రతో తనకున్న అనుబంధం అందరికీ తెలుసన్నారు. నేను మహారాష్ట్ర నుంచి ఏదైనా అడిగినప్పుడల్లా ఇక్కడి ప్రజలు నన్ను హృదయపూర్వకంగా ఆశీర్వదించారని మోదీ తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చాను. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కావాలని నేను మిమ్మల్ని అభ్యర్థించాను. రాష్ట్రంలో 15 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చక్రం తిప్పి బీజేపీని విజయపథంలో నడిపించారు. ఈ రోజు నేను మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని ధూలే భూమి నుంచి ప్రారంభిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. 
 
మహారాష్​ర్ట వాసులకు సేవ చేయాలని సంకల్పిస్తే కొంతమంది ప్రజలను దోచుకోవడానికి వచ్చారని విమర్శించారు. ప్రజలు మహావికాస్ అఘాడి ఏర్పాటు చేసిన మోసపూరిత ప్రభుత్వాన్ని రెండున్నరేళ్లపాటు చూశారు. ముందుగా ప్రభుత్వాన్ని లూటీ చేసి ఆ తర్వాత ప్రజలను దోచుకున్నారు. ఆ విషయాలన్నీ ప్రజలు గమనించారని అన్నారు. మరోమారు ఈ కూటమి పార్టీలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. 
 
అభివృద్ధి చెందిన భారతదేశానికి మహాయుతి మేనిఫెస్టో ప్రాతిపదిక కానుందని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం, మన సోదరీమణులు, కుమార్తెల జీవితాలను సులభతరం చేయడం ముఖ్యమని ప్రధాని తెలిపారు. మహిళలు ముందుకు వెళితే మొత్తం సమాజం వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం మహిళలే కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ప్రతీ మహిళా మోసపూరిత కూటమి పార్టీల హామీలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, దుర్భాషలు, పదజాలం ఎలాంటిదో గుర్తు చేసుకోవాలన్నారు. మహారాష్ర్ట పోలీసు శాఖలో 25వేల మంది కుమార్తెలను నియమింపజేసి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమేంటని ప్రపంచానికే తెలియజెప్పామని మోదీ అన్నారు. 
 
దేశంలో మరాఠీ భాషకు భాషాహోదాను కల్పించిన పార్టీ బీజేపీ అన్నారు. మరాఠాల డిమాండ్​ ను నెరవేర్చామన్నారు. కేవలం మూడు నెలల్లోనే 50 శాతం కంటే ఎక్కువ పెట్టుబడులను సాధించగలిగామని అన్నారు. దేశంలో అతిపెద్ద విమానాశ్రయాన్ని కూడా మహారాష్ర్టలోనే నిర్మిస్తున్నాని తెలిపారు. 
 
నీరు, అటవీ భూమిపై హక్కులను కల్పించామని స్పష్టం చేశారు. రాష్ర్టపతిగా తొలి గిరిజన మహిళకు ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం తమదన్నారు. ఆమెను ఓడించేందుకు కాంగ్రెస్​ చేయని ప్రయత్నాలు లేవన్నారు. అదీగాక రాష్ర్టపతిని అవమానించారని మండిపడ్డారు. 
మహారాష్ర్ట ఎన్నికల్లో 2019తో పోలిస్తే బీజేపీకి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. మరోమారు బీజేపీ మహాయుతి కూటమిని ఆశీర్వదించాలని మోదీ మహారాష్ర్ట ప్రజలకు విజ్ఞప్తి చేశారు.