ఉభయ సభలు నిరవధిక వాయిదా
Both Houses adjourned indefinitely
రాహుల్ పై చర్యలకు బీజేపీ డిమాండ్
తెలంగాణ ఎంపీల నిరసన
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాజ్యసభ, లోక్ సభల్లో శుక్రవారం (చివరిరోజు) కూడా తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో ఇరుసభలు ప్రారంభమైన కొద్దిసేపటికే నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉభయసభల్లో కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పోటాపోటీగా నిరసనలకు దిగారు. రాహల్ గాంధీ ఎంపీలను తోసేయడంపై వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్లమెంట్ వెలుపల నిరసన చేపట్టారు.
మరోవైపు ఎంపీలపై దాడికి సంబంధించి రాహుల్ గాంధీపై ఎఫ్ ఐఆర్ నమోదైంది. 109 హత్యాయత్నం సెక్షన్ ను ఎఫ్ ఐఆర్ నుంచి తొలగించి ఆరు సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ ను నమోదు చేశారు.
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే: రాహుల్ గాంధీ మకర గేట్ వద్దకు రాగానే తాము దారినిచ్చేందుకు ప్రయత్నించాం. కానీ ఆయన ఆగకుండా ఎంపీలు, సారంగి, పాండే, రాజ్ పుత్ లను తోసేస్తూ ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీలు కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. రాహుల్ ఈ ఘటనపై కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడం విడ్డూరం. రాహుల్ ను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది.
స్పీకర్ ఓం బిర్లా: ఏ పార్టీకి చెందిన వారైనా పార్లమెంట్ గేటు వద్ద నిరసనలు చేయడం సరికాదు. నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులకు ఆటంకాలు కలిగించొద్దు. ప్రజాసమస్యల వేదికలో వాటిపైనే చర్చలు జరగాల్సిన అవసరం ఉంది.
రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలను నెట్టిన ఘటన, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఆరోపణలపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేపట్టనుంది.
తెలంగాణ ఎంపీల ఆందోళన..
మరోవైపు ఎంపీలపై రాహుల్ గాంధీ దాడులను నిరసిస్తూ ఈటెల రాజేందర్, డీకె. అరుణ, లక్ష్మణ్ సహచర తెలంగాణ ఎంపీలు నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ఆదివాసీ మహిళ, బీజేపీ సీనియర్ ఎంపీలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దాడిని ఖండిస్తూ గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఇలాంటి దాడులను భారత్ సహించదని ప్లకార్డులను ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.