5, 8 తరగతులకు బోర్డు ఎగ్జామ్!
Board Exam for Class 5-8!
నో డిటెన్షన్ ను తీసుకువచ్చిన కేంద్ర విద్యాశాఖ
నిబంధనల అమలుపై మిశ్రమ స్పందన
పాటించాలా? వద్దా? అనేది రాష్ట్రాల నిర్ణయమే
విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు నిర్ణయం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఐదు నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం తీసుకువచ్చింది. కేంద్ర విద్యాశాఖ ఈ మేరకు సోమవారం ప్రకటించింది. విద్యాహక్కు చట్టంలో పలు సవరణలు చేసింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం దేశంలో నిర్వహిస్తున్న అన్ని పాఠశాలల్లో అమలు కానుంది. కేంద్ర విద్యాహక్కు చట్టం నియమ, నిబంధనలను 16 రాష్ర్టాలు పాటిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ విధానాన్ని అమలు చేయాలా? వద్దా? అనేది ఆయా రాష్ర్టాలకే వదిలివేసింది. ఈ విద్యాహక్కు చట్టం ప్రకారం 5–8 తరగతుల్లో చదివే విద్యార్థులకు బోర్డు పరీక్షల మాదిరి నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయితే రెండు నెలల్లో మరోమారు పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించకుంటే విద్యార్థులను ఆయా తరగతుల్లోనే కూర్చోబెట్టనున్నారు. 2009 నుంచి 7వ తరగతిలో బోర్డు ఎగ్జామ్ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. తాజాగా ఈ చట్టానికి సవరణలు చేశారు. దీంతో విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోనున్నారు. కేంద్ర విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు విద్యాసంఘాలు, రాష్ట్రాల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. గుజరాత్, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, ఢిల్లీతో సహా మరికొన్ని రాష్ట్రాలు ఈ తరగతుల్లో ఫెయిల్ అయ్యే విద్యార్థులను అదే తరగతిలో కూర్చోబెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. కానీ మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఇందుకు విముఖత చూపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం 5, 8వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించడం పట్ల తీవ్ర వ్యతిరేకతను తెలిపింది. ఇది చిన్నారుల్లో తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని స్పష్టం చేసింది. వెనుకబడిన తరగతుల నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు చదువుకు దూరం కాకూడదని, మధ్యలోనే ఆపకూడదనే కారణంతో గతంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు నో డిటెన్షన్ విధానాన్ని తీసుకువచ్చింది. బోర్డు పరీక్షలు లేకపోవడంతో విద్యార్థుల్లో చదువుపై నాణ్యత ప్రమాణాలు తగ్గి పదో తరగతిలోనూ ఫెయిల్ మార్కులే సాధించి పై తరగతులకు వెళుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.