కశ్మీర్ పేరు ‘రిషి కశ్యప్’
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కశ్మీర్ కు రిషి కశ్యపుడి పేరు పెట్టే ఆలోచన ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్ భారత్ లో భాగమే అన్నారు. ఈ భాగాన్ని విడదీయాలని గత ప్రభుత్వాలు సృష్టించిన ప్రయత్నాలను, అడ్డంకులను పూర్తిగా తిప్పికొట్టామన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా గురువారం మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ ను మరోసారి భారత భౌగోళిక, సాంస్కృతికతలో అంతర్భాగంగా చేయగలిగామన్నారు. భారత్ ఏది పోగొట్టుకున్నా దాన్ని త్వరలోనే తిరిగి పొందుతామన్న నమ్మకం ఉందని షా విశ్వాసం వ్యక్తం చేశారు. కశ్మీరీ, డోగ్రీ, బాల్టీ, ఝాన్స్కారీ భాషలకు అగ్రపీఠం వేశామన్నారు. ఇందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత కశ్మీర్‌లోని అతిచిన్న స్థానిక భాషను కూడా సజీవంగా ఉంచాలని, కశ్మీర్ గురించి ప్రధాని మోదీ ఎంతగా ఆలోచిస్తున్నారో తెలియజేస్తోందన్నారు. పాలకులను ప్రసన్నం చేసుకునే చరిత్ర, కాలం ఇక ముగిసిపోయిందన్నారు. సాక్ష్యాధారాల ఆధారంగా చరిత్రను లిఖించుకుందామన్నారు. కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు భారత్ ఒక్కటే అని అభివర్ణించారు. సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా సరిహద్దులున్న దేశం మొత్తం ప్రపంచంలో భారత్ ఒక్కటేనని స్పష్టం చేశారు. భారత్ సంస్కృతి, సాంప్రదాయాలు, సరిహద్దుల వాస్తవాలను వక్రీకరించారన్నారు. కానీ మోదీ ప్రభుత్వం అలా జరగనీయబోదన్నారు. స్వాతంత్ర్యం తరువాత ఎన్నో తప్పులు జరిగాయన్నారు. లడఖ్‌లో దేవాలయాల కూల్చివేశారన్నారు. శంకరాచార్యులు, హేమిష్ మఠం, సూఫీ, బౌద్ధ, రాక్ మఠాలు ప్రస్తుతం అభివృద్ధి చెందాయని దేశ సంస్కృతిని ప్రజల ముందు ఉంచామన్నారు. 370 ఈ ప్రాంతంలో వేర్పాటువాదానికి పునాది వేసిందని, దాన్ని విచ్ఛిన్నం చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.