నిర్మలమ్మ పద్దులో పెద్ద నిర్ణయాలు

Big decisions in Nirmalamma Budjet

Jul 21, 2024 - 13:41
 0
నిర్మలమ్మ పద్దులో పెద్ద నిర్ణయాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్​ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ఐదు పెద్ద నిర్ణయాలను తీసుకోనున్నట్లు ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. 1. కిసాన్​ సమ్మాన్​ నిధి పెంపు, 2. 70ఏళ్ల పైబడిన వారిని కూడా ఆయుష్మాన్​ భవ యోజన కిందకు తేవడం, 3. పొదుపుపై పన్ను పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పెంచే యోచన, 4. అటల్​ పెన్షన్​ యోజన పెంపు, 5. ఆరోగ్యబీమాపై పన్ను మినహాయింపు.

1. కిసాన్​ సమ్మాన్​ నిధి: ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం కిసాన్​ సమ్మాన్​ నిధి. ఈ పథకం ద్వారా రూ. 6వేలను అందిస్తుండగా రూ. 8వేల నుంచి రూ. 10వేల వరకు బడ్జెట్​ లో పెంచే అవకాశం ఉన్నట్లు ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.

2. ఆయుష్మాన్ భారత్ యోజన: 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత చికిత్సనందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వయస్సు గల వారు నాలుగు కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య చికిత్సలను ఉచితంగా అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని 34 కోట్లమంది వినియోగించుకుంటున్నారు. బడ్జెట్​ లో కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఈ సంఖ్య కాస్త 38 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. దీంతోపాటు 70ఏళ్ల పైబడిన వారందరికీ మేలు చేకూరినట్లవుతుంది. 

3. పొదుపుపై ​​పన్ను మినహాయింపు: పొదుపుపై పన్ను పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇదే జరిగితే 2 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు లబ్ధి చేకూరనుంది. ఈపీఎఫ్​, పీపీఎప్​, ఈక్విటీలు, సేవింగ్స్​ పథకాలు, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​, ఎఫ్​ డీ, పెన్షన్​, సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. తద్వారా పొదుపులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ భావిస్తోంది. 

4. ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు: సెక్షన్ 80డి కింద ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరనుంది. చెల్లించే ప్రీమియంపైనే పన్ను మినహాయింపు పొందే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

5. అటల్ పెన్షన్ యోజన: ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన కింద లభించే పెన్షన్‌ను రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచే అవకాశం ఉంది. ఈ పథకంలో చేరాలంటే 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. 60 ఏళ్లు పూర్తయిన తరువాత నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పింఛన్​ అందుతోంది. ప్రస్తుతం ఈ అందే మొత్తాన్నే పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. 

అయితే ఆయా పథకాలపై 2024 నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక పార్లమెంట్​ లో రాష్ర్టపతి ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. 2024–25 బడ్జెట్​ లో కీలక నిర్ణయాలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందని వారికి తెలిపారు. ఈ నేపథ్యంలో 23న విడుదలయ్యే నిర్మలమ్మ బడ్జెట్​ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.